2021 తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2021 ఏడాదికి సాహితీ పురస్కారాలను ప్రకటించింది. పద్యకవితా ప్రక్రియలో డాక్టర్‌ మాడుగుల అనిల్‌కుమార్‌ (శ్రీగిరిజా కళ్యాణం), వచన కవితా ప్రక్రియలో తండా హరీశ్‌గౌడ్‌ (ఇన్‌బాక్స్‌), బాలసాహిత్యంలో మాచిరాజు కామేశ్వరరావు(పాపిష్టిడబ్బు), కథానికా ప్రక్రియలో అలాడి శ్రీనివాస్‌ (ఎడారిపూలు), నవలా ప్రక్రియలో అట్టాడ అప్పలనాయుడు (బహుళ), సాహిత్య విమర్శలో కెపి అశోక్‌కుమార్‌ (తెలుగు నవల ప్రయోగవైవిధ్యం), నాటకం ఎస్‌డీవీ అజీజ్‌ (తుర్రెబాజ్‌ఖాన్‌), అనువాద సాహిత్యంలో స్వర్ణ కిలారి (లిప్తకాలపు స్వప్నం), వచన రచనల విభాగంలో కోడం పవన్‌కుమార్‌ (కరోనా లాక్‌డౌన్‌.360), రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో విజయ భండారు (గణిక) గ్రంథాలు సాహితీ పురస్కారానికి ఎంపికయ్యాయని ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ తంగెడ కిషన్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని వర్సిటీ ప్రాంగణంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో పురస్కారాలను ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. పురస్కారంగా ఒక్కొక్కరికీ రూ.20,116 నగదు అందజేసి సత్కరిస్తామని తెలిపారు. సాధారణ పాఠకుల నుంచి కవులు, రచయితలు, విమర్శకులు, నాటకకర్తల నుంచి సూచనలు స్వీకరించి 2018, 2019, 2020 ఏడాదిలో వెలువడ్డ పుస్తకాలను సేకరించి న్యాయ నిర్ణేతలతో వివిధ దశల్లో పురస్కారాల ఎంపికను నిర్వహించామని వివరించారు.