నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రొమ్ము క్యాన్సర్ రాకుండా మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని లుంబినీ పార్కు నుంచి రవీంద్రభారతి వరకు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వాక్ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో జయలత మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ తో దాదాపు ఏడు లక్షల మంది చనిపోతున్నారని తెలిపారు. ఐదేండ్లలో ఎనిమిది మిలియన్ల మందిలో ఈ క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. రాకుండా నివారించుకోవడంతో పాటు వ్యాధి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తిస్తే నయం చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ సెక్రెటరీ డాక్టర్ టి.కె.శ్రీదేవి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో విశాలచ్చి, జైళ్ల డిప్యూటీ సూపరింటెండెంట్ బంగారు అమరావతి, నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.ఉషారాణి, గైనకాలజిస్ట్ డాక్టర్ జయంతి, ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ నిర్మల తదితరులు పాల్గొని అవగాహన కల్పించారు. డాక్టర్లు, వైద్య విద్యార్థులు, నర్సులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.