– మాజీ సర్పంచ్ కోమటిరెడ్డి సురేశ్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్‌పల్లి
పొలం చుట్టూ వేసిన ఇనుపకంచెను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహాలింగాపురం గ్రామ మాజీ సర్పంచ్ కోమటిరెడ్డి సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాలింగాపురం గ్రామంలోని తన పట్టా భూమి చుట్టూ గతంలో ఇరుపకంచెను ఏర్పాటు చేసుకున్నానని, అయితే కొందరు పనిగట్టుకుని జేసీబీల సహాయంతో ఇనుప కంచెను ధ్వంసం చేశారని తెలిపారు. తన పట్టా భూమిలో నుంచి రోడ్డు కావాలని అడగగా, సామరస్య పూర్వకంగా మాట్లాడుకున్న తదనంతరం సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని వారితో తెలిపినట్టు ఆయన వివరించారు. తాను గ్రామంలో లేనిది చూసుకుని అధికార బీఆర్‌ఎస్ పార్టీకి చెందినవారు జేసీబీతో ఇనుప కంచెను ధ్వంసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్టా భూమి చుట్టూ ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచెను దౌర్జన్యంతో ధ్వంసం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ విషయపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ విషయంపై శకంర్‌పల్లి సీఐ వినాయక్‌రెడ్డిని వివరణ కోరగా గ్రామంలో మాట్లాడుకుని వస్తామని మాజీ సర్పంచ్ సురేష్ రెడ్డి చెప్పడం జరిగిందన్నారు.