అతను ఒక అక్షర సేనాని. నిజాం నిరంకుశత్వాన్ని తన కలంతో ఎండగట్టిన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు. పాత్రికేయ వృత్తికి వన్నె తెచ్చిన యోధుడు. విశాల భావాలు కలగలిన ఆదర్శప్రాయుడు. నికార్సయిన వార్త లతో రజాకార్ల, నిజాం ఆగడాలను ప్రశ్నించి, విలువలు గల సంపాదకీయలు రాసిన మేరు నగధీరుడు షోయబుల్లాఖాన్. ఆయన రచనా జీవితం తేజ్ పత్రికతో ప్రారంభమైంది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథ నాలు రచించారు. అటువంటి రచనల్ని ప్రచురిస్తున్న కారణంగా నిజాం ప్రభుత్వం తేజ్ పత్రికను నిషేధించింది. తర్వాత రయ్యత్ పత్రికలో ఉపసంపాదకునిగా బాధ్యతలు చేపట్టారు. రయ్యత్ పత్రిక కూడా నిజాం నిరంకుశత్వాన్ని విధానపరంగా విభేదించింది. అప్పటికే ముమ్మరంగా తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతోంది. ఆ సందర్భంలో రయ్యత్ పత్రికలో నిజాం ప్రభుత్వం అమలు చేస్తున్న దమనకాండ, ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు రజ్వీని ఉసిగొలుపుతున్న పద్ధతులను వ్యతిరేకిస్తూ రచనలు చేశారు. ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం నిషేధించింది. రయ్యత్ నిషేధానికి గురయ్యాకా షోయబు ల్లాఖాన్ స్వంత నిర్వహణలో ఇమ్రోజ్ అనే దినపత్రికను స్థాపించారు. ఇమ్రోజ్ అంటే తెలుగులో ‘నేడు’ అని అర్థం. ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు ఆయనే స్వీకరిం చారు. రాజకీయ స్థితిగతులు అప్పటికే వేడెక్కాయి. పాకిస్తాన్‌కు కోట్లాది రూపాయలు ధన సహాయం చేయడం వంటి చర్యలు నిజాం, రాజ్యంలోని ప్రజలతో దాదాపుగా యుద్ధం చేస్తూ ఖాసిం రజ్వీ పరిస్థితుల్ని మార్చేశారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాజ్యానికి చెందిన ఏడుగురు ముస్లిం పెద్దలు ఒక పత్రాన్ని తయారు చేశారు. నిజాం రాజుకీ, ఆయన ప్రజలకీ హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో రాజ్యాన్ని విలీనం చేయడమే సరైన నిర్ణయమని ఆ పత్రం సారాంశం. ఈ పత్రాన్ని ఇమ్రోజ్ పత్రికలో యధాతథంగా షోయబుల్లాఖాన్ ప్రచురించారు. ఈ ప్రకటనాంశాన్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ఉపయోగించుకుంటుందేమోనని నిజాం భయపడ్డాడు. ఈ పరిణామాలే చివరకు ఆయన దారుణ హత్యకు కారణ మయ్యాయి. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ 1948 ఆగష్టు 19న జరిగిన సభలో నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే షోయబ్ చేతులు నరికివేస్తామన్నాడు. ఆయన ఈ బెదిరింపులకు లొంగలేదు సరికదా ప్రజల పక్షానే నిలబడ్డాడు. 21న షోయబుల్లాఖాన్ పత్రికా కార్యా లయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో కాచిగూడ రైల్వేస్టేషను రోడ్‌లో ముష్కరులు ఆయన కుడి అరచేతి మునివేళ్లను నరికేశారు. ప్రాణాపాయంతో కొట్టుమిట్టా డుతూ 22న తుదిశ్వాస విడిచాడు. చనిపోయిన తర్వాత కూడా నిజాంకు ఆయనపై కోపం చల్లారలేదు. అంతిమ యాత్రను నిషేధించాడు. కానీ ప్రజల పోరాటంతో పోలీస్ పహరా మధ్య అంతిమయాత్ర జరిగింది.
షోయబుల్లాఖాన్ ఏదీ గుడ్డిగా నమ్మేవాడు కాదు. చాలా తార్కిక దృష్టి. ప్రజాస్వామ్యం లేని సోషలిజం ఎందుకని వాదించేవాడు. ఎమ్‌ఎన్ రారు రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికను తెప్పించుకునేవాడు. ఆయన రాతలు చాలా సీరియస్సే కాని మనిషి మాత్రం సరదాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. సైద్ధాంతిక చర్చలప్పుడు కూడా అనవసర ఘర్షణలకు దిగేవాడు కాదు. చర్చను కూడా నెమ్మదిగా, నిల కడగా చేసేవాడు. ఆయన మంచి పెయింటర్. పెయిం టింగ్ అంటే చాలా ఇష్టం. ఠాగూర్‌ది పెద్ద పోట్రయిట్ గీసాడు. ఉర్దూ, ఇంగ్లీష్ సాహిత్యాలంటే ప్రాణం పెట్టే వాడు. ఏ మూల నిజాం ఆగడాలు చెలరేగుతున్నా, ఎక్కడ ఆర్మీ క్యాంప్స్ ఉన్నా, వాటి గురించి నిర్భయంగా రాసే వాడు. హైదరాబాద్ ఇండియాలో విలీనం కావాల్సిందే నని తన రాతలతో స్పష్టం చేసేవాడు. నిజాంకు వ్యతిరేకంగా ఉన్న ముస్లిం విద్యావంతుల అభిప్రాయా లను ప్రచురించేవాడు. నిజాం మొండితనానికి, రజాకార్ల ఉన్మాదానికి ఎక్కువ బలవుతోంది పేద ముస్లిం కుటుం బాలు, యువకులేనని ఆయన ఎన్నోసార్లు ఆవేదన చెందాడు. హైదరాబాద్ ఇండియాలో విలీనం కావడ మనేది షోయబుల్లాఖాన్ కల, లక్ష్యం. దాని కోసం నడి రోడ్డు మీద ప్రాణాలను బలిపెట్టాడు. అలాంటి త్యాగ మూర్తికి మన పాలకులిచ్చిన గౌరవం… మలక్‌పేటలో ఆయన పేరు మీద ఒక గదితో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు. చూద్దామంటే ఆయన విగ్రహం కూడా లేదు. తర్వాత తరాలు తెలుసుకోవడానికి చరిత్ర లేదు. పాత్రి కేయ వృత్తికే వన్నె తెచ్చిన షోయబుల్లాఖాన్ గురించి నేటి తరం తెలుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయ సాధనకు పాటుపడాలి. నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి.
(నేడు షోయబుల్లాఖాన్ 103వ జయంతి)
– కామిడి సతీష్ రెడ్డీ, 9848445134