‘న్యూస్ క్లిక్’ను కేంద్ర ప్రభుత్వం వేటాడుతున్న తీరు చూస్తుంటే మన చిన్ననాటి ‘పులి- మేక’ కథ గుర్తుకొస్తోంది. ఒక పులి, ఒక మేక ఒకే నీటి ప్రవాహం దగ్గర దాహం తీర్చుకోడానికి చేరాయి. పులికి ఆ మేకను చంపడానికి ఒక సాకు కావాలి. అందుకని తాను తాగే నీటిని బురదమయం చేసేస్తోందని మేకపై ఆరోపించింది. కాని తాను ప్రవాహానికి దిగువన నిలబడి నీరు తాగుతుంటే ఎగువన ఉన్న పులి తాగే నీరు బురదమయం అవడానికి తానెలా కారణం అవుతానని ఆ మేక అడిగింది. అప్పుడు తాను తాగే నీటిని బురద మయం చేసింది ఆ మేక కాకపోయినా, ఆ మేక తండ్రి గతంలో తాను తాగిన నీటిని బురదమయం చేసిందని చెప్పి ఆ పులి తన దాడిని సమర్ధించుకుంది.
కొన్ని నెలలుగా ‘న్యూస్ క్లిక్’ను మోడీ ప్రభుత్వం వెంటాడుతోంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ ఆఫీసులో, ఇంటిలో కూడా ఢిల్లీ పోలీసులు వారాల తరబడి శోధించారు. ఏదైనా ఆర్థిక అవకతవక జరిగిన ఆధారం దొరుకుతుందేమోనని వారు వెతి కారు. కాని ఎంత ప్రయత్నించినా ‘న్యూస్ క్లిక్’ మీద నేరారోపణ చేయడానికి వారికి ఏ విధమైన ఆధా రమూ దొరకలేదు. అందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఎందుకంటే ‘న్యూస్‌క్లిక్’ అటువంటి ఏ విధమైన అవకతవక లకూ పాల్పడలేదు. అందుచేత ఇప్పుడు పూర్తిగా కొత్త ఆరోప ణకు పూనుకుంది ప్రభుత్వం. ఉగ్రవాదానికి పాల్పడిందన్నదే ఆ ఆరోపణ. డజన్ల కొద్దీ ‘న్యూస్ క్లిక్’ ఉద్యోగులను, వారికి వార్త లను అందించే విలేకరులను తెగ వేధించారు. ప్రబీర్ పుర్కా యస్థను, అమిత్ చక్రవర్తిని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద అరెస్టు చేశారు. ఈ చట్టం ఎంత దుర్మా ర్గమైనదంటే, ఆరోపణలు ఎంత హాస్యాస్పదంగా, అర్ధరహితం గా ఉన్నప్పటికీ (ప్రస్తుతం ఈ కేసులో ఆ విధంగానే ఉన్నాయి కూడా) నిర్బంధం నుండి ఏ విధమైన ఉపశమనమూ అభించడం చాలా కష్టం.
ఆర్థిక నేరాలను ఆరోపించడంతో మొదలుబెట్టి ఇలా ఉన్న ట్టుండి ఉగ్రవాదం ఆరోపణ వైపు ఫిరాయించడం ప్రభుత్వానికి స్వతహాగా తట్టిన ఆలోచన కాదు. ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో చాలా దుర్బుద్ధితో రాసిన ఒక వ్యాసం ప్రచురితమైంది. అందు లో నెవెల్లిరారు సింగం అనే ఒక సంపన్నుడైన అమెరికన్ పౌరుడు, చైనా ప్రభుత్వపు ప్రచార యంత్రాంగానికి చాలా సన్ని హితంగా ఉన్నాడని, అనేక మార్గాల ద్వారా చైనా ప్రభుత్వ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోడానికి భారీ మొత్తాలను ఖర్చు చేస్తున్నాడని, వాటిలో ‘న్యూస్ క్లిక్’ కూడా ఒకటని ఆ వ్యాసం ఆరోపించింది.
‘న్యూయార్క్ టైమ్స్’ వ్యాసం చాలా దుష్ట తలంపుతో రాసిన టువంటిది. అమెరికాకు చెందిన ఏ చట్టమూ ఉల్లంఘించబడి నట్టు అది చెప్పలేదు. చైనా ప్రపంచవ్యాప్తంగా ప్రచార కార్యకలా పాలు చేపట్టినట్టు, అందులో సింగం వంటి వ్యక్తుల పాత్ర ఉన్నట్టు అన్యాపదేశంగా కొన్ని సూచనలు మాత్రం చేయగలి గింది. ”నేను ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యుడిని కాను. నేను ఏ రాజకీయ పార్టీ తరఫునా కాని, ఏ ప్రభుత్వం తరఫునా కాని, వాటి ప్రతినిధుల తరఫునా కాని, పని చేయడం, వారి నుండి ఆదేశాలను స్వీకరించడం లేదా ఆదేశాలను అమలు చేయడం అనే ప్రసక్తి లేదు. నేను పూర్తిగా నా వ్యక్తిగత విశ్వాసాలకు, దీర్ఘకాలంగా కలిగివున్న నా వ్యక్తిగత అభిప్రాయాలకు అను గుణంగా మాత్రమే వ్యవహరిస్తున్నాను” అని సింగం ఒక ఇ- మెయిల్‌ను ‘న్యూయార్క్ టైమ్స్’కు పంపాడు. సింగం చేసిన ప్రకటనను ‘న్యూయార్క్ టైమ్స్’ నేరుగా ఖండించలేదు. సింగం ద్వారా గాని, అతని ద్వారా నిధులు పొందినట్టు ఆరోపణలకు గురైన ఏ సంస్థలు గాని అమెరికన్ చట్టాలను ఉల్లంఘించినట్టు నేరుగా ఆరోపించనూ లేదు (కెయిత్లిన్ జాన్స్టన్ ఆగస్టు 12, 2023న మంత్లీ రివ్యూలో రాసిన వ్యాసం ఈ అంశం మీద చాలా వివరాలను ఇచ్చింది). కాని ‘న్యూయార్క్ టైమ్స్’ చాలా విడివిడి ఘటనల వివరాలను తన వ్యాసంలో ప్రస్తావించింది. వాటిలో దేని లోనూ సరుకు లేదు. ఆ వ్యాసం సింగం గాని, అతనితో లింకులు ఉన్నట్టుగా ఆరో పిస్తున్న సంస్థలు గాని ఏదైనా కుట్రలకు పాల్పడుతున్నట్టు ఆరోపించలేదు. కాని అ ఘటనలన్నింటినీ కలిపి చదివితే అంతర్జాతీయ స్థాయిలో చైనా ప్రభుత్వం పెద్ద స్థాయిలో కుట్రకు సన్నాహం చేసిం దన్న భ్రమ కలుగుతుంది.
సింగం చేసిన చట్ట వ్యతిరేక చర్య ఏదీ లేదు. అతడితో సంబంధాలు కలిగి వున్నట్టుగా ‘న్యూయార్క్ టైమ్స్’ ఆరోపిం చిన సంస్థలు సైతం ఏ విధమైన చట్ట వ్యతిరేక చర్యలకూ పాల్పడుతున్నట్టు లేదు. చైనా ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఏవో ప్రచార కుట్రకు పాల్పడుతోందన్న ‘న్యూయార్క్ టైమ్స్’ ఆ కుట్రకు ఈ సంస్థలు గాని, సింగం గాని మద్దతు ఇస్తున్నట్టూ ఎక్కడా లేదు. కేవలం సామ్రాజ్యవాద వ్యతి రేక వైఖరిని, మార్క్సిస్టు అవగాహనను ప్రదర్శించడం తప్ప వాళ్లు చేసిందేమీ లేదు. కాని ‘న్యూయార్క్ టైమ్స్’ ఆ సామ్రాజ్య వాద వ్యతిరేక వైఖరినే చైనా ప్రభుత్వ ప్రచార కుట్రగా చిత్రిం చింది. మెకార్థీ తరహాలో వేధింపుల పర్వానికి ఇటువంటి కుత్సిత మైన వక్రీకరణలు నాందిగా ఉంటాయి. అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లండ్కు మార్కో రూబియో అనే సెనేటర్ ఒక లేఖ రాస్తూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్ వామపక్ష గ్రూపుల కార్యకలాపాల మీద విచారణ చేపట్టాలని, ఆ సంస్థలన్నీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు కలిగి వున్నాయని, అమెరికాలో ఆ సంస్థలు అడ్డూ ఆపూ లేకుండా వ్యవహరిస్తున్నాయని ఆరోపించాడు.
నిరాధారమైన ఆరోపణలను చేస్తే న్యాయపరంగా కేసుల్ని ఎదుర్కోవలసి వస్తుందని లాయర్లు సూచించినందువల్లనో ఏమో ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కేవలం అన్యాపదేశంగా ఆరో పణలను చేయడం వరకే పరిమితం అయింది. కాని, మన ఢిల్లీ పోలీసులకి అటువంటి జాగ్రత్తలేమీ అవసరం లేదు. ఎందు కంటే వాళ్ళ దగ్గర ‘ఉపా’ అనే ఒక ఆయుధం ఉంది. ఆ చట్టం కారణంగా, ఎవరి మీద ఏ విధమైన ఆరోపణలు చేసిన ప్పటికీ వాటిని రుజువు చేసే ఆధారాలను చూపవలసిన బాధ్యత పోలీ సుల మీద లేదు. నెలల తరబడి, ఒక్కోసారి ఏళ్ళ తరబడి కూడా ఏ ఆధారాలనూ కోర్టుల ముందు ఉంచనక్కరలేదు. అందుచేత కేవలం ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో వచ్చిన వార్తను బట్టి (ఆ వార్తలో ఏ ఆధారాలూ లేకపోయినప్పటికీ) ‘న్యూస్ క్లిక్’ సంస్థ చైనా అనుకూల ప్రచారానికి పాల్పడుతోందని అర్ధం లేని నిరా ధారమైన ఆరోపణలకు పోలీసులు పూనుకున్నారు. నేను ‘న్యూస్ క్లిక్’ను రెగ్యులర్‌గా చదువుతాను. చైనా ప్రభుత్వం అను సరించే వైఖరితో ముడిపడి వున్న అంశం ఏదీ అందులో నాకు కనిపించ లేదు. అంతర్జాతీయ పరిణామాలను వామపక్ష, మార్క్సిస్టు దృక్పధంతో విశ్లేషించడం మాత్రమే ఆ పత్రికలో చూస్తున్నాను. చైనా విప్లవం పట్ల ఆ పత్రికకు గౌరవం ఉంది. మూడో ప్రపంచ దేశాల్లో ఉండే వారిలో సామ్రాజ్యవాద వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నట్టు చెప్పుకునే వారెవరికైనా చైనా విప్లవం పట్ల గౌరవం ఉండడం సహజం.
ఉదారవాద బూర్జువా వైఖరికి, మెకార్థీ తరహా ఫాసిస్టు వైఖరికి మధ్య అంత:సంబంధం ఈ సందర్భంలో మనకి కనిపి స్తుంది. ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ప్రపంచంలో అమెరికన్ సామ్రాజ్యవాదం సాగించే యుద్ధాలనన్నింటినీ బలపరుస్తూ వుంటుంది. అయినా, ఆ పత్రిక ఉదారవాద బూర్జువా దృక్ప థాన్ని అనుసరించే పత్రికగానే పరిగణించబడుతూ వుంటుంది. ఉదారవాద బూర్జువా దృక్పథాన్ని బలపరిచేవారు సమాజంలో వ్యక్తం అయే భిన్నాభిప్రాయాలను, వాటిని స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కును గుర్తిస్తారు. అటువంటి ప్రచారం చట్టాలకు లోబడి వుండాలని మాత్రమే వారు చెప్తారు. అటువంటి వైఖరిని అనుసరించే ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఈ మాదిరిగా వ్యాసాన్ని ప్రచురించడం మెకార్థీ తరహా వేధింపులను ప్రోత్సహించడమే ఔతుంది. సామ్రాజ్యవాద వ్యతిరేక, యుద్ధ వ్యతిరేక వైఖరిని అనుసరించడం పట్ల ప్రతికూలతను ప్రదర్శించడం అంటే సమాజంలో ఫాసిస్టు తరహా శక్తులను ప్రోత్సహించడమే.
ఫాసిస్టు శక్తులు ప్రభుత్వ అధికారం చేపట్టినప్పుడు వామ పక్ష ప్రజాతంత్ర శక్తులను అణచివేయడానికి వారు ప్రయోగించే ఆయుధాలు అంతకు మునుపు అధికారంలో ఉండిన ఉదార వాద బూర్జువా ప్రభుత్వాలు రూపొందించినవే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం అందరూ వ్యతిరేకిస్తున్న ఉపా చట్టం మన్మోహన్సింగ్ నేతృత్వంలోని ఉదారవాద బూర్జువా ప్రభుత్వ హయాంలోనే రూపొందింది. కేవలం సంస్థలకే వర్తించే ఆ చట్టాన్ని వ్యక్తులకు కూడా వర్తింపజేస్తూ మోడీ ప్రభుత్వం ఒక సవరణ తెచ్చింది. అందుచేత ఉదారవాద బూర్జువాల కమ్యూ నిస్టు వ్యతిరేక వైఖరికి, ఫాసిస్టు అణచివేతకు మధ్య ఉన్న సంబంధాన్ని విస్మరించకూడదు.
ఇప్పుడు అమెరికాలో ఉన్నది ఒక ఉదారవాద బూర్జువా ప్రభుత్వం. అక్కడ మెకార్థీ తరహా వేధింపులకు అడుగు పడింది. దాని ప్రకంపనలు ఇక్కడ ఇండియాలో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నది ఒక ఫాసిస్టు ప్రభుత్వం. అంటే మెకార్థీయిజం ప్రపంచ వ్యాప్తం అవుతోందన్నమాట. ప్రస్తుత ప్రపంచీకరణ దశలో మెకార్థీయిజాన్ని కూడా ప్రపంచీకరిస్తున్నారు జినోవీవ్ రాసినట్టు ఒక బూటకపు లేఖను సృష్టించి 1924లో బ్రిటన్‌లో కమ్యూనిస్టు బూచిని ముందుకు తెచ్చారు. అప్పుడు అధికారంలో ఉండిన రామ్సే మెక్‌డొనాల్డ్ తాలూకు లేబర్ పార్టీ ప్రభుత్వం కాస్తా ఆ తప్పుడు ప్రచారం దెబ్బకు కూలిపోయింది. అదేమాదిరిగా 1950 దశకంలో అమెరికాలో సెనేటర్‌గా ఉన్న మెకార్థీ కమ్యూ నిస్ట్ ప్రమాదం ముంచుకొచ్చేస్తోందంటూ సాగించిన ప్రచారం అక్కడ కమ్యూనిస్టులను, వామపక్షవాదులను వేటాడడానికి దోహదం చేసింది.అయితే ఆ కాలంలో ఆ వేట అమెరికాకే పరి మితం అయింది తప్ప ప్రపంచం మొత్తం మీద విస్తరించలేదు. కాని, ఇప్పుడు ప్రపంచీకరణ యుగంలో కమ్యూనిస్టు ప్రమాదం గురించి సృష్టించే అభూత కల్పనలు ఏ ఒక్క దేశానికో పరిమితం కావడం లేదు. ఒక చోట ప్రచారం మొదలైతే దాని హానికర ప్రకంపనలు ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. తాను ఎవరిమీదా ఏ విధమైన ఆరోపణలనూ చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఒప్పుకోక పోవచ్చు. కాని ఆ పత్రిక రాతలే ఇక్కడ మోడీ ప్రభుత్వ విషపు దాడులకు దోహదం చేశాయి. ఇక్కడ ఉన్న ఉపా వంటి దుర్మార్గ చట్టాలు యథేచ్ఛగా ఉపయోగించబడుతున్నాయి. ధైర్యంగా ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే అభ్యుదయవాదుల గొంతు నొక్కడానికి సాకుగా ‘న్యూయార్క్ టైమ్స్’ రాతలు ఉప యోగపడుతున్నాయి. ఇటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉందన్న సంగతి ఆ పత్రికకు బాగా తెలుసు. అయినప్పటకీ అటువంటి నిరాధార వార్తలను ప్రచురించడానికే ఆ పత్రిక పూనుకుంది. అంటే వర్తమాన ప్రపంచంలో పాశ్చాత్య దేశాల ఉదారవాద బూర్జువా విధానం తీరు తెన్నులు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు.
ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో మెకార్థీయిజం తీసుకున్న రూపమే చైనా వ్యతిరేక ప్రచారం. ఇక్కడ మోడీ ప్రభుత్వం ఒక్క అంగుళం భారత భూభాగాన్ని కూడా చైనాకు విడిచిపెట్టేది లేదని గట్టిగా ప్రకటిస్తూ వుంటుంది. కాని వాస్తవానికి మన సరి హద్దుల్లో అక్కడక్కడా కొంత భూభాగం చైనా అధీనంలోకి పోయిందన్న వార్తలు వెలువడుతున్నాయి. సహజంగానే అటు వంటి వార్తలు ప్రజల్లో చైనా పట్ల వ్యతిరేకతను కలిగిస్తాయి. ఆ చైనా వ్యతిరేకతను ఇక్కడ కమ్యూనిస్టుల మీద, ప్రభుత్వ విమర్శకుల మీద సాగించే మెకార్థీ తరహా దాడుల సమర్ధనకు ఉపయోగించుకుంటోంది మోడీ ప్రభుత్వం. దేశంలో ఏ కాస్త అయినా స్వతంత్రంగా వ్యవహరించే మీడియా ఉన్నా దాని గొంతు నొక్కడానికి ‘చైనా’ వ్యతిరేకతను ముందుకు తెస్తున్నది.
ఉదారవాద బూర్జువా దృక్పథం నిజంగా ఫాసిస్టు వ్యతిరేక తను అనుసరించాలంటే, ఫాసిస్టు మెకార్థీయిజానికి తోడ్పడ కుండా ఉండాలంటే అది కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేయడం మానుకోవాలి. ప్రస్తుతం వేగంగా ప్రపంచవ్యాప్తంగా మెకార్థీయిజం విస్తరిస్తూ ఫాసిస్టు శక్తులు బలపడడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తున్నప్పుడు ఉదారవాద బూర్జువా శక్తులు ఈ స్పష్టతను కలిగివుండడం అత్యవశ్యం.
( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్ పట్నాయక్