పవిత్రంగా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో

Sincerely the BRS Manifesto– ఇప్పుడు మాకోసం పనిచేయండి.. ఐదేండ్లు మీకోసం చేస్తాం : కార్యకర్తలతో మంత్రి కేటీఆర్‌
– సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ – సిరిసిల్ల రూరల్‌
భగవద్గీత, బైబిల్‌, కురాన్‌లాగా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో పవిత్రంగా ఉందని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్లలోని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సోమవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 నుంచి 95 సీట్లు గెలిస్తేనే మనకు ముఖం తెలివి ఉంటుందని, ఈ 45 రోజులు ప్రతి ఒక్క కార్యకర్త మాకోసం పనిచేయాలని, ఆ తర్వాత ఐదేండ్లు మీకోసం పనిచేస్తామని అన్నారు.
కలెక్టరేట్‌లోని ప్రజావాణిలాగా పార్టీ జిల్లా కార్యాలయంలోనూ ప్రతివారం దరఖాస్తులు తీసుకొని సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఈ భవనంలోనే మీడియా సెంటర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ భవన్‌ ఏర్పాటు చేస్తామని, వ్యక్తులు శాశ్వతం కాదని వ్యవస్థ శాశ్వతం కావాలన్నారు. నాయకులు ఒకరికొకరు పంతాలకు వెళ్లకుండా పార్టీ గెలుపు కోసం పని చేయాలని కోరారు.
కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్న తీరు చాలా విడ్డూరంగా ఉందని, కాంగ్రెస్‌ పథకాలను తాము కాపీ కొట్టామనడం సిగ్గుచేటన్నారు. ఎవరి పథకాలను ఎవరు కాపీ కొట్టారో ప్రజలకు తెలుసన్నారు. సీఎం కేసీఆర్‌ పథకాలను దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కాపీ కొట్టారన్నారు. కేసీఆర్‌ ఏది చెప్పినా అది ఎంత కష్టమైనా చేసి చూపిస్తారన్నారు.