– మీ చెల్లి చనిపోతే ఇలానే మాట్లాడతారా..? :
– కేటీఆర్‌ను నిలదీసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
– ఆరు పథకాలను తప్పకుండా అమలు చేస్తాం
– డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం : వికారాబాద్‌లో కాంగ్రెస్ బహిరంగ సభ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి, వికారాబాద్ ప్రతినిధి
‘ఆడ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే అవమానిస్తూ.. ఏ పరీక్ష రాయలేదంటావా.. ఆది నీకు తగునా, మీ చెల్లినో మీ కాక బిడ్డనో చనిపోతే ఇలానే మాట్లాడతారా..’ అంటూ గ్రూపు-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్యపై కేటీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిలదీశారు. డిసెంబర్ నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తోందని, ఆరు పథకాలను తప్పకుండా అమలు చేస్తామని, డిసెంబర్ 9వ తేదీన తొలి సంతకం దానిపైనే చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ చేవేళ్ల ప్రాణహిత ప్రాజెక్టును ప్రారంభించిందని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు తెస్తానని చెప్పి నేటికీ తేలేదన్నారు. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ తెచ్చేందుకు జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. దానికి కేసీఆర్ అడ్డుపడటంతోనే రాలేదని తెలిపారు. ఏ రోజు కూడా ఈ ప్రాంతంలో రాళ్లతో, కర్రలతో కొట్టుకోలేదన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, సోదరి సునీతారెడ్డి కారుపై రాళ్ల దాడి చేయించి ఆ సంస్కృతికి తెర లేపిన ఘనత వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, కేసీఆర్‌దీ కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ దశ, దిశ మార్చే సమయం వచ్చిందన్నారు. నీళ్లు జగన్ రెడ్డి తీసుకుపోయారు.. నిధులు కృష్ణారెడ్డి తీసుకుపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ఆపదలో ఉన్న సమయంలో పార్టీని కాపాడిన రామ్మోహన్ రెడ్డికి మొదటి విడతలోనే టికెట్ కేటాయించినట్టు తెలిపారు. కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపునకు పట్టుదలతో కృషి చేయాలన్నారు. సమావేశంలో వికారాబాద్ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, డీసీసీ అధ్యక్షులు, పరిగి అభ్యర్థి రామ్మోహన్‌రెడ్డి, జహీరాబాద్ అభ్యర్థి, మాజీ మంత్రి చంద్రశేఖర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.