బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌

– షాద్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ను వీడుతున్న సీనియర్‌ నేతలు
– కాంగ్రెస్‌లో పెరుగుతున్న నేతల చేరికలు
– వీర్లపల్లి రాజకీయ ఎత్తుగడలకు బీఆర్‌ఎస్‌ కుదేలు
నవతెలంగాణ-షాద్‌నగర్‌
షాద్‌నగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడుతున్నారు. రెండు పర్యాయాలు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి అధికారం కోసం పని చేసిన నేతలు ప్రస్తుతం పార్టీని వీడుతున్నారు. పార్టీలో ఎన్నికలవేళ అసంతృప్తితో ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లో భారీగా చేరిక పర్వం కొనసాగుతుంది. స్వయానా షాద్‌నగర్‌ నియోజకవర్గంపై టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో కాంగ్రెస్‌ షాద్‌నగర్‌ అసెంబ్లీ అభ్యర్థిగా తనదైన శైలితో వీర్లపల్లి శంకర్‌ వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ అండతో నియోజకవర్గ రాజకీయాలను వీర్లపల్లి శంకర్‌ కుదిపేస్తున్నాడు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగు వెలిగిన సీనియర్‌ నేతలను తిరిగి పార్టీలో చేరడం పట్ల విశేషంగా చొరవ చూపుతున్నారు. ఇందుకు నిదర్శనం షాద్‌ నగర్‌ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌ రెడ్డి, ఉద్యమ నాయకుడు ఫరూఖ్‌ నగర్‌ మండల జడ్పిటిసి వెంకట్‌ రాం రెడ్డి, కేశంపేట మండలం జడ్పీటీసీ విశాల శ్రవణ్‌ రెడ్డి, కొత్తూరు మండలం మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్‌ రెడ్డి, అంతేకాకుండా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. నాయకులు సొంత గూటికి తిరిగి వస్తుండటంతో నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీని తన భుజస్కందాలపై వేసుకొని పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలకు ధైర్యాన్ని భరోసాను ఇచ్చి అధిష్టానం మెప్పు పొందుతున్నారు వీర్లపల్లి శంకర్‌.
కాంగ్రెస్‌కు కలిసి వచ్చేనా
షాద్‌నగర్‌ నియోజకవర్గంలో హస్తం ఊపు జోరు మీద కనబడుతుంది. గత ఎన్నికల్లో పార్టీని వీడిన నేతలందరూ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం కలిసి వచ్చే అవకాశంగా కనబడుతుంది. వీర్లపల్లి శంకర్‌ ఒంటరి పోరుకు నేతల చేరికతో బలం చేకూరుతుంది. బీఆర్‌ఎస్‌కు ఎదురులేదని సాగుతున్న ప్రచారంలో నేతల చేరికపర్వంతో చెక్‌ పడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఊహకందని విధంగా కాంగ్రెస్‌లో నేతల చేరికలు జోరుగా సాగుతున్నాయి. సర్పంచులు, ఎంపీటీసీలతోపాటు మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీలో చేరడం మరింత బలాన్ని చేకూరుస్తున్నట్లు అవుతుంది. బీఆర్‌ఎస్‌్‌, కాంగ్రెస్‌ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ సమీకరణాలు వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ని గెలిపించడమే లక్ష్యంగా వీర్లపల్లి శంకర్‌ రాజకీయ ఎత్తుగడలను చాకచక్యంగా రూపొందిస్తున్నారు. ఒంటరిగా నాలుగేళ్లు పార్టీని బుజస్కందాలపై వేసుకున్న వీర్లపల్లి శంకర్‌ పనితీరుకు నేతలు సైతం వారెవ్వా అనే విధంగా ఫలితాలు, నేతల చేరికలు కొనసాగుతున్నాయి.