– బీఆర్‌ఎస్‌తోనే మరింత అభివృద్ధి సాధ్యం
– ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-షాద్‌నగర్
ప్రతిపక్షాల మాయమాటలు నమ్మకండి అని, అభివద్ధి చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే..తర్వాత అభివృద్ధి చేసేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తెలిపారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లిలో మున్సిపల్ అధ్యక్షులు నటరాజన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ ఆలోనిపల్లి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. చటాన్ పల్లిలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అణచివేతకు గురై అభివద్ధిలో పూర్తిగా కుంగిపోయిందని ఆ సమయంలో ఉద్యమ బహుట ఎగరవేసిన కేసిఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించాడన్నారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 9ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర భూమి పల్లెలు పట్టణాలు దినదినాభివద్ధి చెందుతూ వచ్చాయన్నారు. నీటి కోసం, కూటికోసం, ఆదాయం కోసం అర్రులు చాచిన తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ పాలనలో సంతోషంగా ఉన్నారన్నారు. కెేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రాని ఇల్లంటూ తెలంగాణలో లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభివద్ధిని చూసి ఓటు వేయండని ఎవరు ఏ ప్రలోభాలకు గురి చేసిన లొంగకూడదని అన్నారు. రైతు బంధు, బీసీ బంధు లాంటి పథకాలను దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా కొనసాగించడం లేదని, సంక్షేమ పథకాలను దేశానికి చాటిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు వెంకట్ రాం రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎలికట్ట సర్పంచ్ సాయి ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.