అడ్డగోలు దందా

నారాయణ విద్యాసంస్థల నయామోసం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జేఈఈ మెయిన్‌ ఫలితాలపై తప్పుడు ప్రకటనలు  ఆలిండియా స్థాయిలో ఒకటో ర్యాంకులు
ఐదు వచ్చాయంటూ ప్రచారం  టాప్‌టెన్‌లో మూడు ర్యాంకులేనంటూ వెల్లడి ఆ కాలేజీలో చదవకపోయినా వాడుకున్న ర్యాంకర్ల పేరు  విద్యార్థులు,తల్లిదండ్రులను మభ్యపెడుతున్న వైనం  చోద్యం చూస్తున్న విద్యాశాఖ
ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చేయటం ఇంద్రజాలికుల మాయాజాలం. రాని ర్యాంకును వచ్చినట్టు చూపటం లేని విద్యార్థిని ఉన్నట్టు చూపటం నారాయణ దందాజాలం. ఈ కార్పొరేట్‌ దందాలో అటు తల్లిదండ్రులు,ఇటు విద్యార్థులు సమిధలవుతున్నారు. లాభాలే పరమావధిగా ధనార్జనే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ అడ్డగోలు వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన సర్కారు చేష్టలుడిగి చూస్తున్నది. ఈ మొత్తం వ్యవహారంపై నవతెలంగాణ ప్రత్యేక కథనం.
కార్పొరేట్‌ విద్యాసంస్థ అయిన నారాయణ జేఈఈ మెయిన్‌ ఫలితాలకు సంబంధించి తప్పుడు ప్రకటన విడుదల చేసిందంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలిండియా స్థాయిలో ఒకటో ర్యాంకులు ఐదు నారాయణ విద్యాసంస్థకు మాత్రమే సొంతమంటూ ప్రచారం చేసుకున్నది. ఒకటో ర్యాంకు సాధించిన వారిలో పి లోహిత్‌ ఆదిత్య సాయి, సాయి దుర్గారెడ్డి నందిపాటి, ధీరావత్‌ తనూజ్‌, దీశాంక్‌ ప్రతాప్‌సింగ్‌, ఎండీ సాహిల్‌ అక్తర్‌ ఉన్నారు. అయితే ఆ ర్యాంకులు వారికి ఏయే కేటగిరీలో వచ్చాయో ప్రకటించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఆ ఐదు ర్యాంకులూ జనరల్‌ కేటగిరీలోనే వచ్చాయా? లేక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా వివిధ కేటగిరీల్లో వచ్చాయా అనే స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఇంకోవైపు టాప్‌టెన్‌లో మూడు ర్యాంకులు వచ్చాయంటూ అదే విద్యాసంస్థ ప్రకటించింది. ఓపెన్‌ కేటగిరీలో రెండు, ఐదు, ఆరు ర్యాంకులే వచ్చాయని వివరించింది. ఆలిండియా స్థాయిలో ఒకటో ర్యాంకులు ఐదు వచ్చిన నారాయణ విద్యాసంస్థకు టాప్‌టెన్‌లో మూడు ర్యాంకులే వచ్చాయంటూ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. విద్యార్థులు, తల్లిదండ్రులను మభ్యపెట్టడమే దీని ఉద్దేశమని అర్థమవుతున్నది. ఇంకోవైపు ఆలిండియా ఒకటో ర్యాంకు వచ్చిన పి లోహిత్‌ ఆదిత్యసాయి
నారాయణ విద్యాసంస్థలో చదువుకున్న విద్యార్థే కాదు. అయినా ఆ విద్యార్థి పేరును వాడుకున్నది. ఈ రకంగా అడ్డగోలుగా ర్యాంకుల పేరుతో అబద్ధాల దందా నిర్వహిస్తున్నది. విద్యావ్యాపారాన్ని విస్తరించేందుకు ఇష్టారాజ్యంగా ప్రకటనలు ఇస్తున్నది. ఇతర కార్పొరేట్‌ విద్యాసంస్థలు, ప్రయివేటు జూనియర్‌ కాలేజీలు కూడా ప్రకటనలు ఇచ్చాయి. కానీ నారాయణ విద్యాసంస్థ మాత్రం బరితెగించి ఆలిండియా స్థాయిలో ఒకటో ర్యాంకులు ఐదు వచ్చాయంటూ ప్రకటించింది. ఇంత జరిగినా ఉన్నత విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డు చోద్యం చూస్తున్నాయి. ఆ విద్యాసంస్థకు ఇప్పటి వరకు నోటీసులివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీన్ని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తప్పుడు ప్రకటనలు ఇచ్చిన నారాయణ విద్యాసంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.
‘క్యాష్‌’ చేసుకుంటున్న నారాయణ
కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివితేనే ఐఐటీ-జేఈఈ, నీట్‌లో మంచి ర్యాంకులు వస్తాయంటూ పలు కాలేజీలు విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించేలా ప్రకటనలు ఇస్తున్నాయి. రంగురంగుల భవనాలు, 1,1,1,1,1, 2,2, 3,3 ఇలా టాప్‌ టెన్‌లో ఎన్ని ర్యాంకులు వస్తే అన్ని ఇస్తాయి. ఆ ప్రకటనలను చూసి చాలా మంది ప్రభావితమవుతారు. సహజంగానే విద్యార్థుల జీవితం పట్ల తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. జీవితంలో ఏ రంగంలో స్థిరపడాలన్నా ఇంటర్‌ చదువే చాలా కీలకం. అందుకే డబ్బు గురించి ఆలోచించకుండా కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వారి పిల్లలు విద్యలో ముందుండాలని, ఏ విషయంలోనూ తక్కువ కాకూడదనే ఉద్దేశంతో ఆ కాలేజీల్లో చేర్పించేందుకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే దీన్నే నారాయణ వంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలు ‘క్యాష్‌’ చేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని అబద్ధాలతో ఆకర్షించే కుయుక్తులకు పాల్పడుతున్నాయి. ఈ అనైతిక విద్యావ్యాపారాన్ని అరికట్టేందుకు విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలు మీడియాలో వచ్చే ప్రకటనలను పర్యవేక్షించడం కోసం ఇంటర్‌ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఇటీవల ఓ కమిటీని నియమించింది. ప్రకటన ఇచ్చే ముందు ఇంటర్‌ బోర్డు అనుమతి తప్పనిసరి అని ఆదేశించింది. ఆ కమిటీ తూతూమంత్రంగా పనిచేస్తున్నదనీ, నారాయణ వంటి కార్పొరేట్‌ కాలేజీలను నియంత్రించడంలో విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఆ కాలేజీల మాయలో పడకుండా విద్యార్థుల జీవితాలను రక్షించాలంటూ విద్యావేత్తలు కోరుతున్నారు. ప్రభుత్వం వాటి ఆగడాలను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.