దొరల తెలంగాణ మనకొద్దు…

We don't want a noble Telangana...– ప్రజల తెలంగాణ కావాలి… మోడీ చేతిలో ‘బీఆర్‌ఎస్‌’ రిమోట్‌ : విజయభేరి సభలో రాహుల్‌, ప్రియాంక గాంధీ
– కాంగ్రెస్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది
నవతెలంగాణ – ములుగు
తెలంగాణ ప్రజల కలలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విస్మరించారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని, అందుకే ఇప్పుడు మన రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో.. దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ముందుగా డిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో బేగంపేట్‌ విమానాశ్రయానికి చేరుకున్న వారు.. అక్కడినుంచి హెలికాఫ్టర్‌లో రామప్ప దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. ముందుగా ములుగు జిల్లా రామానుజపురం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి బస్సులో వెళ్లారు. సభా వేదిక మీదికి చేరిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీకి ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్‌ నేత కొండ సురేఖ బతుకమ్మలతో స్వాగతం పలికారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. జీవితంలో రామప్ప వంటి అందమైన, అద్భుతమైన ఆలయం ఇప్పటికీ చూడలేదంటూ రామప్ప ఆలయ విశిష్టతను కొనియాడారు. అమరవీరులు శ్రీకాంతాచారి ఆశలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నడుచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని, దాని ప్రకారమే 2014లో ఆ హామీని నిలబెట్టుకున్నామని, తమకు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చి ప్రజల కలను నిజం చేశామని తెలిపారు. కానీ ప్రత్యేక తెలంగాణలో సామాజిక న్యాయం జరగడంలేదని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ మంత్రివర్గంలో కేవలం ముగ్గురు బీసీ మంత్రులు మాత్రమే ఉండటం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అభివర్ణించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు. మూడు ఎకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఎంతమందికి వచ్చాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటికో ఉద్యోగం అంటూ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. కర్నాటక, చత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, ధరణి పోర్టల్‌లో నిరుపేదల భూములను లాక్కున్నారని అయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏ ఒక్క కేసు కూడా కేంద్ర ప్రభుత్వం నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు కలిసే స్నేహపూర్వకంగా పనిచేస్తున్నాయని అన్నారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్‌ను 27శాతం నుంచి 23 శాతానికి తగ్గించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలోని ప్రజలందరి ఆకాంక్ష కోసమే కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తుందని, ఇందుకోసం బీజేపీపై యుద్ధం చేస్తున్నామని స్పష్టంచేశారు. దీనికి అందరి సహకారం అవసరమని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను వివరిం చారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం పేరుతో ప్రతి నెల రూ.2500 అందిస్తామని, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, రైతు భరోసా పేరుతో ప్రతి ఎకరాకు రూ.15000, రైతు కూలీలకు రూ.12వేలు అందిస్తామన్నారు. ఇందిరమ్మ పథకం పేరుతో రూ.5లక్షలు, నిరుపేదలకు రూ.4000 పెన్షన్‌, యువకులకు, నిరుద్యోగులకు రూ.5లక్షల ఆర్థిక సాయం, ఆడపిల్లలకు ఎలక్ట్రికల్‌ స్కూటర్‌ అందజేస్తామని, మేడారానికి జాతీయ హోదా కల్పిస్తామంటూ హామీల వర్షం కురిపించారు. బీఆర్‌ఎస్‌ మోడీ రిమోట్‌తో పనిచేస్తుందని ఆరోపించారు. గిరిజనులు ఆదివాసీల కలలను నెరవేర్చేందుకు ఇందిరా గాంధీ కృషి చేశారని తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారంటీ పథకాలను మొదటి రోజే అక్కడి క్యాబినెట్‌ అమలు చేసిందని, తెలంగాణలో సైతం అదే జరుగుతుందని వివరించారు. ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీతక్కను, భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సభానంతరం ఆదే బస్సులో భూపాలపల్లికి పయనమయ్యారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, నాయకులు మధుయాష్కి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, బలరాం నాయక్‌, పోడెం వీరయ్య, కొండా సురేఖ, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నేతలు, తదితరులు పాల్గొన్నారు.