అంబేద్కర్‌ బౌద్ధం ఎందుకు స్వీకరించారు?

Why did Ambedkar embrace Buddhism?‘హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణిం చను’ – అని డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ యోలా సభలో ప్రకటిం చారు. ఆ తర్వాత-1956 అక్టోబర్‌ 14న బర్మా భిక్షువు చంద్ర మణి ద్వారా నాగ్‌పూర్‌లో బౌద్ధం స్వీకరిం చారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో పూర్తిగా అర్థం చేసుకోవా లంటే ఆయన పుట్టి పెరిగిన పరిస్థితుల్ని పరిశీ లించాలి. ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో ఉన్న పరిస్థితులు ఆనాడు దేశంలో 20వ శతాబ్దంలో లేవు. అంతకుముందు 19,18 శతాబ్దాలలో అణగారిన వర్గాల జీవితం ఇంకా చాలా దయ నీయంగా ఉండేది. ఉదాహరణకు అంబేద్కర్‌ స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు, స్కూల్లో తాగేం దుకు మంచినీళ్ళు దొరికేవి కావు. దళితులకు నిర్దేశించిన కుండలోని నీరే వారు తాగాలి. ఎట్టి పరిస్థితులలోనూ పక్కనే ఉన్న అగ్రవర్ణం వారి కుండ ముట్టుకోగూడదు. నల్లాలో నీళ్ళు వస్తున్నా స్వతంత్రంగా వెళ్ళి నీళ్ళు తాగే పరిస్థితి లేదు. దాహంగా ఉందని అభ్యర్థిస్తే, స్కూలు బంట్రోతు కరుణించి వచ్చి, నల్లా తిప్పితే దూరంగా ఉండి దోసిలి పట్టి తాగి, పక్కకు జరగాల్సిందే. క్లాసు బయట కింద కూర్చుని పాఠాలు వినాల్సిందే తప్ప, తోటి విద్యార్థులతో కలిసి క్లాసులో బెంచి మీద కూర్చునే పనిలేదు. అంబేద్కర్‌ తెలివైన వాడు గనుక, విషయాలు సులభంగానే గ్రహించేవాడు. ఒకసారి మేస్టారు ఒక లెక్కను ఎవరైనా వచ్చి బోర్డు మీద చేసి చూపండి అంటే – అంబేద్కర్‌ చేస్తానని లేచి నిలబడ్డాడు. కాని, క్లాసులోని పిల్లలంతా గోల చేశారు. ఎందుకంటే, అంబేద్కర్‌ దళిత బాలుడు గనుక బోర్డు ముట్టుకుంటే బోర్డు వెనకాల ఉన్న అగ్రవర్ణ పిల్లల అన్నం మూటలు మైలబడి పోతాయని బాధపడిపోయారు. ఆనాటి పరిస్థితులు అలా ఉండేవి.
పాఠశాలల్లో ప్రథమశ్రేణి కేవలం బ్రాహ్మణ పిల్లలకే రావాలి. శూద్రులకు రాకూడదన్న అప్రకటిత నియమం ఉండేది. ఆ రోజుల్లో బనారస్‌, అలీఘర్‌ విశ్వవిద్యాలయాల్లో దళితులకు విద్య కోసం కేటాయించిన గ్రాంట్‌ ఆపేశారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య విద్యార్థులకు అన్ని సదుపాయాలుండేవి. ఈ మూడు వర్గాల వారికి సేవ చేయడమే శూద్రుల ధర్మమని మనుస్మృతి చెప్పిన దాని ప్రకారమే అంతా జరుగుతూ ఉండాలని కోరుకునే వారు. అందుకు ప్రయత్నిస్తూ ఉండేవారు కూడా! మనిషికి మనసు ఉంది. జంతువులుగా లేరు కాని, తమకు ఉన్న మన సును సంస్కారవంతంగా, నైతికతతో ఉంచుకోవాలన్న ఆలోచన అగ్రవర్ణాల వారికి ఉండేది కాదు. హిందూధర్మం అధిక సంఖ్యాకులైన శూద్రుల్ని, దళితుల్ని నిరుత్సాహ పరిచేది. నిమ్నజాతుల వారి జీవితాల్లో ఆశ ఉండేది కాదు. అభ్యుదయం ఉండేది కాదు. వారు నిరాశలో పుట్టి పెరగాల్సిందే. ఎదిగే అవ కాశాలు ఎంత మాత్రమూ ఉండేవి కావు. అసహ్యం, నిరాదరణ, కోపతాపాలు ఎదుర్కొంటూ, అవమానాల పాలవుతూ శూద్రులు, దళితులు బలవంతంగా జీవనం కొనసాగిస్తున్న రోజు లవి. అలాంటి కాలంలో అంబేద్కర్‌ పుట్టి పెరిగారు. అన్ని రకాల వివక్షల్ని ఎదుర్కొంటూ, ఓపికగా పోరాడుతూ, ఒక్కొక్క మెట్టూ పైకి ఎదుగుతూ వచ్చారు.
ధనికులకు ధర్మం అక్కరలేదు. పీడితులకు మాత్రం ధర్మం వైపు నిలబడాల్సి ఉందన్న విషయం అంబేద్కర్‌ గ్రహించారు. ఆ రోజుల్లో మహిళలకు గుర్తింపు లేదు. వైదిక మతం ప్రకారం మహిళలంతా శూద్రులే. వారికి స్వేచ్ఛలేదు, విద్యలేదు, సమా జంలో గుర్తింపూ, గౌరవం లేదు, సతీ సహగమనం మాత్రం ఉంది. కాలే కడుపుకు తిండి పెట్టాలంటే వ్యభిచారం చేసుకో వాల్సిందే. ఆ రోజుల్లో బొంబాయిలో వ్యభిచారులు సులేమాన్‌ హోటల్లో భీమాప్లేట్‌ రోటీ తినగలిగే వారు. సంసారం చేసే గృహిణులకు అది కూడా ఉండేది కాదు. నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్‌ వారి ప్రధాన కార్యాలయం ఉంది. వారి ప్రభావం తగ్గించడానికి అంబేద్కర్‌ ధమ్మదీక్ష అక్కడ తీసుకున్నారని కొందరు వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. దానికి ఆయన తగిన సమాధానమే చెప్పారు. ఆరెస్సెస్‌ అనే సంస్థ అసలు తన దృష్టిలోనే లేదని, తను నాగ్‌పూర్‌ను ఎన్నుకోవడానికి బలమైన కారణాలు చాలా ఉన్నాయని చెప్పారు. నాగ్‌ పూర్‌ పట్టణానికి ఆ పేరు ఎందుకొచ్చిందంటే అది నాగజాతికి చెందిన ఆదివాసులకు నిలయం. వారంతా బుద్దుని అనుయాయులు ఒకప్పుడు వీరే బుద్దుడికి రక్షణగా ఉన్నారు. ఈ నాగజాతి ఆర్యుల ఆగడాలకు బలైపోయిన జాతి. అక్కడ నాగనది కూడా ఉంది. వీట న్నింటి కారణంగా తను బౌద్ధం స్వీకరించ డానికి ఈ పట్టణాన్ని ఎన్నుకున్నానని అంబేద్కర్‌ వివరణ ఇచ్చారు.
ఆ రోజుల్లో లోకమాన్య బాలగంగాధర తిలక్‌ ‘కేసరి’ అనే పత్రిక వెలువరించేవారు. ఈయన అంబేద్కర్‌ను విమర్శిస్తూ వ్యాసాలు ప్రకటించేవారు. పేదలైన అస్పృశ్యలను అంబే ద్కర్‌ తప్పుదారి పట్టిస్తున్నారనీ, వారిని బౌద్ధంలోకి తీసుకుపోవడం అన్యాయ మనీ రాసేవారు. మృతకళేబరాలు తొలగిం చడం వల్ల మెహర్‌ (మాల-మాదిగ)లకు రూ.500 ఆదాయం లభిస్తోంది కదా? అది లేకుండా అంబేద్కర్‌ వారి నోట్లో మట్టి కొడుతున్నాడని విమర్శించారు. అంతే కాదు, రిజర్వేషన్‌తో వచ్చే యం.ఎల్‌.ఏ/ యం.పీ సీట్లు పోతాయి కదా? దళితుల అవకాశాలకు అంబేద్కర్‌ గండి కొడుతున్నాడని తిలక్‌ అతని సహచరులు ఆక్రోషించారు. అంబేద్కర్‌ అందుకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు. బ్రాహ్మణులు మెహర్లుగా మారి, జంతు మృత కళేబరాలు తొలగిస్తూ, దాని మీద వచ్చే ఆదాయం వారు తీసుకోవచ్చు కదా? ఎందుకంత ఉక్రోషం?అని ప్రశ్నించారు. దళితుల రిజర్వేషన్‌ స్థానాల్లో కూడా అసెంబ్లీకి, పార్లమెంటుకు అగ్రవర్ణం వారే పోటీచేసి గెలుచుకోవచ్చు కదా అందులో ఉన్న ఇబ్బంది ఏమిటీ? అని ప్రశ్నించారు అసలు విషయం ఏమి టంటే సమనత్వానికి అగ్రవర్ణాల వారు అంగీకరించకపోవడమే! అధిక సంఖ్యాకులైన శూద్రులు, దళితులు తమకు బానిసలుగా పడి ఉండాలని వారు కోరుకోవడమే. ఆ పరిస్థితి మారిపోతూ ఉందంటే వారు భరించలేరు కదా? అధిక సంఖ్యాకులైన బహు జనులు తమ గుప్పిట్లోంచి ఎగిరిపోతున్నారని బెంబేలు పడి పోయారు. హిందుత్వ వాది అయిన తిలక్‌ బాధ కూడా అదే-
తమిళ బౌద్ధ ఉద్యమకారుడు పండిత అయోతీథాస్‌ అంబే ద్కర్‌ బౌద్ధం స్వీకరించక ముందే ఒక మాట చెప్పారు. పీడిత కులస్తులంతా అస్థిత్వ పోరాటాలు చేయాలే గాని, కాందిశీకు ల్లాగా అగ్రకులాలను అనుకరించగూడదని వాదించాడు. అలాగే మన తెలుగువాడు; ఫిజిక్స్‌ ఫ్రొఫెసర్‌, నవ బౌద్ధుడూ అయిన లక్ష్మీ నరసు రాసిన జుూూజుచీజజు ఉఖీ దీఖణణ×ూవీ గ్రంథ ప్రభావం అంబేద్కర్‌పై బాగా పడిందని చెపుతారు. ఎందుకంటే 1948లో అంబేద్కర్‌ ఆ పుస్తకానికి ముందుమాట రాసి, తనే స్వయంగా బొంబాయిలో మలి ముద్రణ వేయించారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా అంబేద్కర్‌ బౌద్ధం వైపు ఆకర్షింపబడడానికి కారణా లయ్యాయి. బౌద్ధం సముద్రం లాగా విశాలమైంది. లోతైంది. సముద్రంలో చేరిన నదుల నీటికి గుర్తింపు ఉండదు. బౌద్ధం స్వీకరించిన తర్వాత కులమతాల గుర్తింపులుండవు. అందరూ సమానమే! వైదిక ధర్మం అసమానతలపై ఆధారపడి ఉంటే, బౌద్ధం సమానత్వంపై ఆధారపడి ఉంది. అందుకే అది ప్రపం చంలోకి 128 దేశాలకు వ్యాపించింది. ఒక ధర్మక్రాంతి విలసి ల్లింది. లోతుగా పరిశీలిస్తే మన రాజ్యాంగంలో బౌద్ధం ఉంది. బుద్ధుడు చెప్పిన కార్యకారణ సంబంధంలో నుంచే ప్రపంచ వైజ్ఞానిక పరిశోధనలు సాగాయి. బుద్ధుడి బోధనలు లేకపోతే గాంధీ అహింసా సిద్ధాంతం ఉండేది కాదు. పండిట్‌ నెహ్రూ పంచశీలా ఉండేది కాదు. కొంచెం లోతుగా ఆలోచిస్తే అన్నింటిలో బౌద్ధం మూలాలు కనిపిస్తాయి.
అశోక చక్రమైనా, సారనాథ్‌ స్థూపమైనా, దేశ వ్యాప్తంగా ఊరూరా ఎన్నో బౌద్ధ చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా బౌద్ధ చిహ్నాలే దేశ చిహ్నాలయ్యాయి. న్యూడిల్లీలోని రాష్ట్రపతి భవన్‌, దర్బార్‌ హాలులో నిలువెత్తు బౌద్ధ విగ్రహం ఉంది. దాని ముందే కేంద్ర మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. భారతరత్న, పద్మశ్రీ, వంటి బిరుదులు ఇచ్చేదీ అక్కడే. అక్కడి బుద్ధ విగ్రహం పాదాలు ఏ ఎత్తులో ఉన్నాయో – రాష్ట్రపతి భవన్‌కి కింద కి.మీ. దూరంలో ఉన్న ఇండియా గేట్‌ పై భాగం అంతే ఎత్తులో ఉంటుంది. మన దేశంలోని రాజ్యాంగాన్ని వ్యవస్థలూ ప్రజలూ సరిగా పాటిస్తే – ఇప్పటికీ మన దేశం బౌద్ధ దేశంగానే కొనసాగుతూ ఉండేది. మానవహక్కులు, ఆత్మ గౌరవం బౌద్ధంలో దక్కుతాయి. అది దైవ భావన మీద, అసమానతల మీద, ఆధార పడిలేదు.
ఇతర మతాల్ని, ధర్మాల్ని ప్రవేశ పెట్టినవారు, తాము దేవ తలమనో, దేవదూతలమనో ప్రకటించుకున్నారు. కానీ, బుద్ధుడు అలా ప్రకటించుకోలేదు. కనీసం తన వారసుణ్ణి ప్రకటించమని శిష్యులు కోరినప్పుడు బుద్ధుడు అందుకు సమ్మతించలేదు. ధమ్మమే తన వారసుణ్ణి ప్రకటించుకుంటుందని చెప్పాడు. అందుకే భగవాన్‌ (పరిపూర్ణ మానవుడు) అయ్యాడు. అన్నింటినీ కాపీ కొట్టి తమలో కలిపేసుకున్నట్టుగానే ఈ పదాన్ని కూడా వైదికులు స్వీకరించారు. పైగా ఎక్కడా అస్థిత్వంలో లేనివాణ్ణి భగవంతుడని ప్రార్థిస్తూ వచ్చారు. ఇంకా ప్రార్థిస్తున్నారు. సర్వ జీవరాసుల్ని ప్రేమించాలని చెప్పిన బౌద్ధం – మానవజాతి అంతా ఒకటేనని, నేటి ఆధునిక జన్యుశాస్త్రం చెప్పిన విషయాన్ని శతాబ్దాలకు ముందే బౌద్ధం చెప్పింది. బౌద్ధం మనుషులైన వారందరికీ నచ్చుతుంది. అందుకే, అంబేద్కర్‌ స్వీకరించి ఈ దేశ ప్రజలకు ఒక వెలుగుదారి చూపించారు. తన జీవితమంతా ఎదుర్కుంటూ వచ్చిన అణిచివేతను, అవమానాలను జీవిత చర మాంకంలో ఆయన బౌద్ధంతో తుడిపేసుకున్నారు. నవయాన నవబౌద్ధుడిగా మారారు. దేశానికి ఆదర్శమూర్తిగా నిలిచారు.
బౌద్ధం స్వీకరించడానికి డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ నాగపూర్‌ లో రామ్‌దాస్‌పేట్‌ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. ప్రస్థుతం అది నాగపూర్‌లోని అభయాంకర్‌నగర్‌లో ఉంది. ధమ్మదీక్ష తీసు కున్న తర్వాత ఒక నెల పదిహేను రోజులకు అంబేద్కర్‌ మరణిం చారు (6 డిసెంబర్‌ 1956) ఆయన మరణం తర్వాత ఇరవై మిలియన్ల మంది మార్చి 1959లో బౌద్ధం స్వీకరించారు. అంబే ద్కర్‌ స్మారక సమితి ఏర్పడి నాలుగు ఎకరాలలో అక్కడ ఒక స్థూపం నిర్మించారు. గొప్ప బౌద్ధ దర్శనీయ స్థలంగా తీర్చిదిద్దారు.
– సుప్రసిద్ద సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌
(మెల్బోర్న్‌ నుంచి)
డాక్టర్‌ దేవరాజు మహారాజు