న్యూస్‌క్లిక్‌ కేసులో ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు

Delhi Police in Newsclick case Supreme Notices– తదుపరి విచారణ 30కి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
న్యూస్‌క్లిక్‌ కేసులో ఢిల్లీ పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తమపై నమోదైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కేసును సవాల్‌ చేస్తూ న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ, న్యూస్‌ వెబ్‌సైట్‌ హెచ్‌ఆర్‌ విభాగం హెడ్‌ అమిత్‌ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ పోలీసుల స్పందనను సుప్రీంకోర్టు కోరింది. గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవారు, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 30కి వాయిదా వేసింది.ప్రబీర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ ”ప్రబీర్‌ లోపల ఉన్నారు. ఆయన వయస్సు 72 ఏండ్లు. అందువల్ల త్వరగా విచారణ జరపండి” అని అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ తాము నోటీసులు జారీ చేస్తామని, మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తామని ధర్మాసనం పేర్కొంది. అది చాలా దూరం అవుతుందని, వెంటనే విచారించాలని కపిల్‌ సిబల్‌ అన్నారు. ”దీన్ని శుక్రవారమే విచారణకు తీసుకోలేం. శుక్రవారం మాత్రమే పని దినం (దసరా సెలవులకు ముందు). అక్టోబర్‌ 30 వచ్చే సోమవారం జాబితా చేస్తాం” అని ధర్మాసనం తెలిపింది. హెచ్‌ఆర్‌ విభాగ అధిపతి తరపు సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపిస్తూ తమ కేసు వినాలని, ఇందులో కూడా నోటీసులు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం ఆ కేసులో కూడా నోటీసులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. తమను పోలీసు కస్టడీకి అప్పగించాలన్న ట్రయల్‌ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పుర్కాయస్థ, చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.