
– ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు
నవతెలంగాణ – వేములవాడ: బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తా.. సీఎం కేసీఆర్ కృషితో ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. శుక్రవారం వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని మహాత్మా గాంధీ, సర్వాయి పాపన్న, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామస్తులు డప్పుచప్పులతో, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా చల్మెడ స్వయంగా డప్పు వాయించుకుంటూ, అందరితో కలసి నడిచి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ.. మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలు పైకి చూస్తే బాగా కనిపిస్తున్నారే తప్ప వారి కడుపులోని బాధ, కళ్ళల్లోని నీళ్లు మాత్రం కనిపించడం లేదని, వారి బాధలు వర్ణనాతీతమని, నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకే గుండెకాయ వంటి మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికి నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడం చాలా బాధాకరమని అన్నారు. చీర్లవంచ గ్రామంలో ముఖ్యంగా మూడు సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరొక్కసారి అధికారం ఇచ్చి, సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసి, వేములవాడ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే చీర్ల వంచతో పాటు మిగతా గ్రామాల ప్రజల సమస్యలను 6నెలల్లోపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అట్లాగే రూ. 600 కోట్లతో పాత చీర్లవంచ గ్రామంలో అమెరికా దేశం సహకారంతో చేపల ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీంతో సుమారు 5వేల మందికి ఉపాధి లభిస్తుందని, నిర్వాసితుల ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు అపెరల్ పార్కులో ఉద్యోగ నియామకాలలో మిడ్ మానేరు యువతి యువకులకు ప్రత్యేక కోట అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వందకు వంద శాతం ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వమని, రాబోయే రోజుల్లో ముంపు గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకునే తమ ప్రభుత్వానికి ఉందని భరోసా కల్పించారు. అంతకుముందు ప్రచారంలో భాగంగా గ్రామానికి చేరుకున్న చల్మెడ సమీపంలోని అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ-బాబు, వైస్ ఎంపీపీ రవి చందర్ రావు, ఎంపీటీసీ ల ఫోరమ్ మండల అధ్యక్షుడు వనపర్తి దేవరాజ్, సర్పంచులు రంగు సత్తెమ్మ-రాములు, రాసూరి రాజేశం నాయకులు స్వామి గౌడ్, శ్రీనివాస్, మహేష్, మహిళ నాయకురాలు కొమురవ్వ, విద్యార్థి విభాగం నాయకుడు జక్కుల నాగరాజుతో పాటు అధిక సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.