జంప్‌ జిలానీలు

– రాజకీయ పార్టీల్లో చేరికల జోరు
– ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది జోరందుకుంటున్న చేరికలపర్వం
– ద్వితీయ శ్రేణి, యువతే టార్గెట్‌
– పావులు కదుపుతున్న నాయకులు
నవతెలంగాణ-కొడంగల్‌
కొడంగల్‌ నియోజకవర్గంలో ఎన్నికల వాతా వరణం మరింత వేడెక్కనుంది, ఎన్నికల నోటిప ˜ికేషన్‌తో రాజకీయ పార్టీల అభ్యర్థులు వలసలు మరింత కీలకంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు చోటా మోటా నాయకులు అడపాదడపా పార్టీలు మారుతుండటంతో ప్రస్తుతం చేరికల పర్వం జోరం దుకుంది. అభ్యర్థులు తమ పార్టీల కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులపై, యువతపైనే దృష్టి సారించారు. ద్వితీయ శ్రేణి నాయకులను, కొద్దో గొప్పో ఓటర్ల వద్ద పలుకుబడి కలిగిన వారిని చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అదనుగా ఎప్పటి నుంచో పార్టీ మారాలని చూస్తున్న వారు జంప్‌ చేస్తున్నారు.
పార్టీల్లో వలసల జోరు
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అనే తేడా లేకుండా రెండు పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది చేరికలు పెరిగే అవకాశం ఉంది. ఇన్ని రోజులు తగిన సమయం కోసం వేచి చూసిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఎన్నికలను అదనుగా భావిస్తున్నారు. దీంతోకి తోడు అభ్యర్థులు కూడా చేరికలతో తమ బలాన్ని, ఓట్లను పెంచుకోవాలని చూస్తున్నారు. నామినేషన్‌ వేసే సమయానికి గ్రామాల్లోని ప్రధాన నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ద్వితీయ శ్రేణి నాయకులు, యువతే టార్గెట్‌
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు నియోజకవర్గంల్లోని ప్రతి గ్రామాన్ని సందర్శించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో చేరికలు ఉండేలా నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని పార్టీలు ప్రధానంగా మండల స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి కేంద్రీకరించారు. ఇతర పార్టీల సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, మండలాధ్యక్షులు తదితర స్థానాల్లో ఉన్న వారిని చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ద్వితీయశ్రేణి నేతలు చేరితే వారికుండే ఓటు బ్యాంకు తమ ఖాతాలో పడిపోతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో ప్రాధాన్యత లేదనుకున్నవారు, పదవులు ఆశించి భంగపడ్డవారు, ఇతర నేతలతో పొసగని వారు పక్క చూపులు చూస్తున్నారు. మరికొందరు గెలిచే అభ్యర్థిని అంచనా వేసుకుని పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామా ల్లోని యువతకు పార్టీలు గాలం వేసేందుకు ప్రణా ళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలన్ని పాలువులు కదుపుతున్నాయి. తటస్థంగా ఉంటున్న వారిని మాత్రం అనుకూలంగా మార్చు కోవాలని ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల్లో వలసలను పోటాపోటీగా పార్టీల్లోకి ఆహ్వానిస్తు న్నారు. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లలోకి వలసలు ఊపందుకున్నాయి.