సమవుజ్జీల సమరం

Struggle of Samavujjis– నేడు భారత్‌, న్యూజిలాండ్‌ ఢ
– ఐదో విజయంపై ఇరు జట్ల గురి
– మ|| 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
వన్డే వరల్డ్‌కప్‌ వేటలో టీమ్‌ ఇండియా ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లను ఎదుర్కొంది. అయినా, ఆ మ్యాచ్‌లను సమవుజ్జీల సమరంగా చూడలేదు. ధర్మశాలలో నేడు న్యూజిలాండ్‌తో ఢకొీట్టనున్న రోహిత్‌సేన.. ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో తొలిసారి సమవుజ్జీతో సై అంటోంది. ప్రపంచకప్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మాత్రమే అంచనాలను అందుకుంటూ.. వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించాయి. ఇప్పుడు గ్రూప్‌ దశ ఐదో మ్యాచ్‌లో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ఇరు జట్లు ఐదో విజయంపై కన్నేసి బరిలోకి దిగుతుండగా భారత్‌, కివీస్‌ పోరు నేడే.
నవతెలంగాణ-ధర్మశాల
ఆస్ట్రేలియా, అఫ్గనిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌.. గ్రూప్‌ దశలో టీమ్‌ ఇండియా చేతిలో చిత్తయిన జట్లు. ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్థాన్‌.. న్యూజిలాండ్‌ దూకుడుకు బలైన జట్లు. ఇటు ఆతిథ్య భారత్‌, ఇటు న్యూజిలాండ్‌ వరుసగా నాలుగేసి విజయాలతో దండయాత్ర చేస్తున్న తరుణంలో.. ధర్మశాల వేదికగా ఈ రెండు జట్ల సమరానికి సైరన్‌ మోగింది. 2015, 2019 ప్రపంచకప్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ ఈసారి మరింత మెరుగ్గా రాణిస్తోంది. సొంతగడ్డపై పుష్కర కాలం విరామం అనంతరం మళ్లీ ప్రపంచకప్‌ విజయం సాధించాలనే సంకల్పంతో ఉన్న టీమ్‌ ఇండియాను నేడు న్యూజిలాండ్‌ ఢకొీట్టనుంది. సమవుజ్జీలు తలపడుతున్న సమరంలో ఇరు జట్లూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
టీమ్‌ ఇండియాకు తిరుగులేదు :
బ్యాటర్లు, బౌలర్లు భారత్‌ను అగ్రపథాన నడిపిస్తున్నారు. ఏ మ్యాచ్‌లోనూ రోహిత్‌సేన 4 కంటే ఎక్కువ వికెట్లు చేజార్చుకోలేదు. బౌలర్లు నాలుగు మ్యాచుల్లో ఏకంగా 36 వికెట్లు పడగొట్టారు. ఏ జట్టుకూ ఈ స్థాయిలో గణాంకాలు లేవు. టాప్‌ ఆర్డర్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి భీకర ఫామ్‌లో ఉన్నారు. కోహ్లి, రోహిత్‌ చెరో సెంచరీతో కదం తొక్కగా.. గిల్‌ ఓ అర్థ శతకంతో జోరందుకున్నాడు. కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు సైతం మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో బ్యాట్‌తో భారత్‌కు తిరగులేదు. బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌, జడేజాలతో కూడిన బౌలింగ్‌ దళం ప్రత్యర్థులకు దడ పుట్టిస్తోంది. కొత్త బంతితో బుమ్రా, సిరాజ్‌ను ఎదుర్కొవటం నేడు కివీస్‌ బ్యాటర్లకు సవాల్‌ కానుంది. కుల్దీప్‌ యాదవ్‌కు ధర్మశాలలో మంచి రికార్డుంది. జడేజాతో కలిసి కుల్దీప్‌ కివీస్‌ను మాయ చేసేందుకు రెఢగాీ ఉన్నాడు.
ఉరకలేసే ఉత్సాహం :
కీలక బ్యాటర్‌, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయంతో దూరమైనా న్యూజిలాండ్‌ దూకుడు తగ్గలేదు. టామ్‌ లేథమ్‌ నాయకత్వం కివీస్‌ను మరింత ఉత్సాహంగా నడిపిస్తుంది. ప్రపంచకప్‌లో ఆ జట్టు ఆటగాళ్లు అందరూ ఫామ్‌ చాటారు. డెవాన్‌ కాన్వే, విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, టామ్‌ లేథమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌చాప్‌మాన్‌ ఇలా అందరూ బ్యాట్‌తో సత్తా చాటారు. రచిన్‌ రవీంద్ర బ్యాటింగ్‌ విన్యాసాలు న్యూజిలాండ్‌ అదనపు బలం చేకూర్చుతున్నాయి. లక్ష్యాన్ని నిర్దేశించినా, ఛేదించినా కివీస్‌ బ్యాటర్లు కదం తొక్కుతున్నారు. సహజంగానే న్యూజిలాండ్‌ది బలమైన బౌలింగ్‌ విభాగం. ట్రెంట్‌ బౌల్ట్‌, మాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గుసన్‌ ధర్మశాల పిచ్‌పై స్వింగ్‌ రాబట్టి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిచెల్‌ శాంట్నర్‌ గతంలోనూ భారత బ్యాటర్లను మాయ చేశాడు. ఇప్పుడు ధర్మశాలలోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలని భావిస్తున్నాడు.
సూర్య, షమి ఇన్‌?
ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయం రోహిత్‌సేనను దెబ్బకొట్టింది. చీలమండ గాయంతో పాండ్య కివీస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. పాండ్య లోటు భర్తీ చేసేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ ఇద్దరు ఆటగాళ్లను తుది జట్టులోకి చేర్చే ఆలోచనలో ఉంది. హార్దిక్‌ పాండ్య స్థానాన్ని బ్యాట్‌తో సూర్యకుమార్‌ యాదవ్‌, బంతితో మహ్మద్‌ షమి భర్తీ చేయనున్నారు!.
పిచ్‌, వాతావరణం
భారత్‌లో అత్యధికంగా స్వింగ్‌, పేస్‌ లభించే పిచ్‌ ధర్మశాల. ప్రపంచకప్‌లోనూ స్వింగ్‌ బౌలర్లు ఇక్కడ సక్సెస్‌ సాధిస్తున్నారు. పేసర్లకు అనుకూలించినా ధర్మశాల భారీ స్కోర్లకు వేదిక. భారత్‌, కివీస్‌ మ్యాచ్‌లో బంతిని మెరుగ్గా స్వింగ్‌ చేయగల జట్టు పైచేయి సాధించగలదు. మ్యాచ్‌ సమయంలో ఎటువంటి వర్షం సూచనలు లేవు. టాస్‌ నెగ్గిన తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌.
న్యూజిలాండ్‌ : డెవాన్‌ కాన్వే, విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, డార్లీ మిచెల్‌, టామ్‌ లేథమ్‌ (కెప్టెన్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మాన్‌, మి చెల్‌ శాంట్నర్‌, మాట్‌ హెన్రీ, ఫెర్గుసన్‌, బౌల్ట్‌.