– పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో డీజీపీ
– పోలీసు అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ఐపీఎస్ అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
త్యాగాలతోనే విజయాలను సాధించగలమనీ, ఈ విషయాన్ని అనేక మంది పోలీసు అమరవీరులు తమ త్యాగాలతో నిరూపించారని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ ఉద్ఘాటించారు. శనివారం గోషామ హల్ పోలీసు స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ, ఫ్లాగ్‌డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం లభించాక అంతర్గత భద్రతలు సుభీక్షంగా ఉంచడానికి వందలాది మంది పోలీసులు విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు విధి నిర్వహణలో 189 మంది పోలీసులు అమరులయ్యారని ఆయన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా మొక్కవోని దీక్షతో పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని నేరస్థుల కుట్రలను ఎప్పటికప్పుడు భగం చేయాల్సినవసరం ఉన్నదని అన్నారు. దేశంలోనే అత్యుత్తమ పోలీసు వ్యవస్థగా రాష్ట్ర పోలీసు శాఖ నిలిచిందనీ, ముఖ్యంగా షీ టీమ్స్ మహిళల భద్రత విషయంలో సాధిస్తున్న విజయాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందనీ, పలు అవార్డులు కూడా లభించాయని ఆయన అన్నారు. అలాగే, పాస్‌పోర్టు జారీ వ్యవస్థలో పోలీసు శాఖ విధులు అత్యంత చురుకుగా సాగి అందరి మన్ననలు అందుకున్నా యని ఆయన అన్నారు. అంతకముందు పోలీసు అమరవీరుల స్థూపం వద్ద డీజీపీ అంజనీకుమార్‌తో పాటు నగర పోలీసు కమిషనర్లు సందీప్ శాండిల్య, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనిల్ కుమార్, ఇతర సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు శివధర్‌రెడ్డి, సౌమ్య మిశ్రా, జితేందర్, కె. శ్రీనివాస్‌రెడ్డి, సంజరు జైన్ లు పుష్ప గుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. వీరితో పాటు పలువురు రిటైర్డ్ డీజీపీలు, సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా స్థూపం వద్ద పుష్ప గుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సాయుధ పోలీసులు నిర్వహించిన అమరవీరుల సంస్మరణ కవాతు అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ఈ కార్యక్రమంలోనే ‘అమరులు వీరు’ అనే పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు. అలాగే, పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలిగా పలువురు పోలీసులు రక్తదానం చేశారు.