– బంగాళాఖాతంలో అల్పపీడనం
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫానుకి ‘హమూన్’గా పేరు పెట్టినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) మంగళవారం ప్రకటించింది. ఒడిసాకు 200 కి.మీ దూరంలో తీరం దాటే అవకాశం ఉన్నందున ఒడిశాపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 21 కి.మీ వేగంతో దూసుకువస్తున్న ఈ తుఫాను మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అన్నారు. ఒడిశాలోని పారాదీప్‌కు 230 కి.మీ, పశ్చిమ బెంగాల్‌లోని ధిగాకు 240 కి.మీ దూరంలో, బంగ్లాదేశ్‌లోని చిట్టిగాంగ్‌కు 410 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. ఈశాన్య దిశగా కదులుతున్న తుఫాను క్రమంగా బలహీనపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని, గంటకు 65 -75 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. బుధవారం బంగ్లాదేశ్‌లోని హెపుపరా , చిట్టిగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఒడిశాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.