– ఆహ్వానించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర పథకాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంతర్జాతీయ వేదికపై ప్రసంగించనున్నారు. లండన్లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆమెను ఆహ్వానించింది. ఈ నెల 30న ఆమె డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఇతివృత్తంలో భాగంగా ఉపన్యాసం ఇవ్వనున్నారు. తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివద్ధి, సంక్షేమ పథకాలపై మాట్లాడనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు అంశాలపై ఆమె ప్రసంగిస్తారు. అలాగే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వత్తులను ప్రోత్సహించడమే కాకుండా అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించనున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీటి సరఫరాతో పాటు వైద్య, విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కూడా యూనివర్సిటీలో కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు.