సాంఘీక భద్రత బిల్లు రూపొందించండి

Draft a Social Security Bill– రాజకీయపార్టీలకు టీజీపీడబ్ల్యూయూ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని 4.2 లక్షల మంది గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం కార్మికుల కోసం సాంఘీక భద్రత బిల్లు రూపొందించాలని తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్‌ (టీజీపీడబ్ల్యూయూ) వ్యవస్థాపక అధ్యక్షులు షేక్‌ సలాఉద్దీన్‌ రాజకీయపార్టీలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో ఈ అంశాలను పొందుపర్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయాలని కోరారు. ఓలా, ఊబర్‌, ర్యాపిడో, పోర్టర్‌, స్విగ్గి, జొమాటో, బ్లింక్‌ ఇట్‌, డుంజో, బిగ్‌ బాస్కెట్‌, షాడో ఫాక్స్‌, అర్బన్‌ కంపెనీ వంటి పలు సంస్థల సేవల్లో 4.2 లక్షల మంది డెలివరీ భాగస్వాములుగా పనిచేస్తున్నారని వివరించారు. ఇటీవల రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వం గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం కార్మికులకు సాంఘిక భద్రత కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చిందని ఉదహరించారు. తెలంగాణాలో కూడా అలాంటి చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఆయా యాప్‌ బేస్డ్‌ ప్లాట్‌ఫాంలో జరిగే ప్రతి లావాదేవీ పైనా ఒక రుసుమును నిర్ధారించి దాన్ని కార్మికుల సంక్షేమ సెస్‌ పేరుతో సాంఘీక భద్రత నిధికి డిపాజిట్‌ చేయాలని సూచించారు. అగ్రిగేటర్స్‌ (ప్లాట్‌ఫాం యజమానులు), కార్మిక సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులతో త్రైపాక్షిక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగేటర్ల ప్లాట్‌ఫాంలో నమోదు చేసుకున్న కార్మికులందరూ ఆ బోర్డులో ఆటోమాటిక్‌గా రిజిస్టర్‌ అవ్వాలనీ, ఆయా ప్రయోజనాలు పొందటానికి వారికి అర్హత కల్పించాలని సూచించారు. కేంద్రీకృత ఉమ్మడి పోర్టల్‌ను ఏర్పాటు చేసి, అగ్రిగేటర్ల వ్యాపార వ్యవహారాల పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.