– రాజకీయ ప్రచారకులుగా ప్రభుత్వ అధికారులు
– ప్రభుత్వ ఘనకార్యాల ప్రచారం
– నవంబర్ 20 నుంచి రెండు నెలల పాటు కార్యక్రమం
– ఇది కోడ్ ఉల్లంఘనేనంటున్న సీనియర్ అధికారులు
– సీఈసీకి ఫిర్యాదు
‘జిల్లాల్లో రథ్ ప్రభారీలుగా నియమించేందుకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులు, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి నుండి గ్రామ పంచాయతీ స్థాయి వరకూ అధికారులను వెంటనే నామినేట్ చేయండి. గత తొమ్మిది సంవత్సరాల మోడీ పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను నవంబర్ 20వ తేదీ నుండి జనవరి 25 వరకూ ప్రచారం చేసేందుకు ఈ అధికారులను ఉపయోగించుకోవాల్సి ఉంది’ … ఇది తాజాగా మోడీ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు. ఇలా అధికారికంగానే ప్రభుత్యోద్యోగులను రాజకీయ ప్రచారకులుగా మార్చడం ఈ దేశం ఇప్పటి వరకూ ఎరుగని వింత. ఈ మోడీ సర్కారు తెగింపుపై మాజీ ఉన్నతాధికారులు మొదలు రాజకీయ విశ్లేషకుల వరకూ మండి పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను గురించి ప్రచారం చేసేందుకు, వాటిని ప్రదర్శించేందుకు దేశంలోని మొత్తం 765 జిల్లాల్లో ‘రథ్ ప్రభారీ’లను (ప్రత్యేక అధికారులను) నియమించాలంటూ ఈ నెల 17న అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆ ఆదేశాలు సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి.
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేతలు
జైరాం రమేష్, పవన్ ఖేరా వంటి కాంగ్రెస్ ప్రతినిధులు మోడీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. స్వతంత్రంగా, రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన ప్రభుత్వోద్యోగులను, సైనికులను ఇలా ప్రచారానికి వాడుకోవడం తగని పని అని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధానికి ఓ లేఖ రాశారు. కేంద్ర సివిల్ సర్వీసుల
నిబంధనలకు ఇది విరుద్ధమని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల అధికారులు రాజకీయ కార్యకర్తలుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. సైనికులు ప్రభుత్వ పథకాల మార్కెటింగ్ ఏజెంట్లుగా మారుతున్నారని మండిపడ్డారు. దీనిని ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించారు.
ఇందిర హయాంలో…
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని ఇందిరాగాంధీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారంటూ 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు చారిత్రక తీర్పు చెప్పింది. దీంతో ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమెపై అనర్హత వేటు పడింది. ప్రధాని సచివాలయంలో తనకు సహాయకుడిగా పనిచేస్తున్న యశ్పాల్ కపూర్ అనే అధికారిని తన విజయావకాశాలను మెరుగుపరచుకునేందుకు ఇందిర ఉపయోగించుకున్నారని, తద్వారా ఆమె ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ తీర్పు వచ్చిన రోజే గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ (ఐ) ఘోర పరాజయం పొందింది. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా ఉన్న మోడీ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందిరకు వ్యతిరేకంగా 19 ర్యాలీలు, ఆరు రోడ్‌షోలలో ప్రసంగించారు. అయితే ఆయన ఇప్పుడు ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించి ప్రచారార్భాటం కోసం ప్రభుత్వ అధికారులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మాజీ అధికారుల మండిపాటు
ప్రభుత్వ ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ స్పందించారు. ఈ నెల 21న ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాస్తూ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా ఆదేశాలు జారీ చేయడం అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఇలాంటి చర్యలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. ఎన్డీఏ ప్రభుత్వానికి మేలు చేకూర్చేందుకే ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు’ అని ఆయన విమర్శించారు. అధికారులను రథ్ ప్రభారీలుగా నియమించాలంటూ రక్షణ శాఖ సహా అన్ని మంత్రిత్వ శాఖలకు జారీ చేసిన ఆదేశాలపై సీనియర్ అధికారులు కూడా స్పందించారు. ‘రక్షణ శాఖ అధికారులను ఎన్డీఏ ప్రభుత్వ విజయాలపై ప్రచారానికి పంపడం ఆందోళన కలిగించే విషయం. దీర్ఘకాలంలో ఇలాంటి చర్యలు మంచివి కావు’ అని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు శర్మ లేఖకు మద్దతుగా మాజీ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం కూడా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అయితే ఈ లేఖలపై సీఈసీ ఇంకా స్పందించలేదు. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్సీ సక్సేనా సైతం ప్రభుత్వ చర్యపై ఘాటుగా మాట్లాడారు. ప్రభుత్వోద్యోగులను ప్రచారానికి వాడుకోవడం తాను ఇప్పటి వరకూ చూడలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వోద్యోగులు, రాజకీయవేత్తల మధ్య ఉన్న రేఖను ఇది చెరిపేస్తోందని విమర్శించారు. ‘ఒక వైపు ఎన్ఎస్ఎస్ఓ, ఎన్ఎఫ్హెచ్ఎస్ వంటి సమాచార వ్యవస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఎన్ఎఫ్హెచ్ఎస్ అధిపతి ఇటీవలే రాజీనామా చేశారు కూడా. మరో వైపేమో ప్రభుత్వ పనితీరుపై ప్రచారం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.