– కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్షకు డిమాండ్
– చడీచప్పుడూలేని రాష్ట్ర సర్కారు
– తేల్చని కేంద్ర బృందం
– గందరగోళచర్యల్లో ప్రభుత్వం
– కుట్ర ఉందంటూ పోలీసు కేసు
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని లక్ష్మిబ్యారేజీ కుంగిన నేపథ్యంలో మొత్తం ఆ ప్రాజెక్టు నిర్మాణంపైనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పగుళ్లు వచ్చిన పిల్లర్లే అవినీతి, అక్రమాలకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. దీంతో మొత్తం ప్రాజెక్టునే నిపుణులతో పూర్తిస్థాయిలో సమీక్ష చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది. తద్వారా సమగ్ర విచారణ చేసి అవినీతి తిమింగలాలను పట్టుకుని శిక్షించాలనే డిమాండ్ ముందుకు వస్తున్నది. కానీ, తెలంగాణ ప్రభుత్వం గానీ, సాగునీటి, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులుగానీ స్పందించకపోవడం గమనార్హం. ఎన్నికల కోడ్ పేరుతో ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు నోరు కుట్టేసుకున్నారు. అన్ని అంశాలపై స్పందిస్తున్న ప్రభుత్వంలోని కీలకమంత్రులు కాళేశ్వరం కుంగుబాటుపై మాత్రం కిక్కురుమనకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుకు చెందిన లక్ష్మిబ్యారేజీ నిర్మాణం పూర్తయి దాదాపు ఐదేండ్లు అవుతున్నది. బ్యారేజీకి చెందిన 18, 19, 20, 21 పిల్లర్లల్లో 20వ పిల్లర్‌కు పూర్తిస్థాయిలో పగుళ్లు వచ్చి దెబ్బతిన్నట్టు సాగునీటి శాఖ ఇంజినీర్ల అంచనా. అయితే నిజాలను దాచిపెడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈనేపథ్యంలో కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) డ్యామ్ సేఫ్టీకి చెందిన అనిల్‌కుమార్ జైన్ తోపాటు మరో ఐదుగురితో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని మహాదేవ్‌పూర్‌కు పంపింది. మంగళవారం పగుళ్లు పట్టిన 20వ పిల్లర్‌ను ఆ బృందం పరిశీలించింది. బ్యారేజీ కుంగిపోవడానికి కారణాలను మాత్రం స్పష్టం చేయలేదు. మరో రెండురోజులు అధ్యయనం చేస్తేగానీ, అసలు కారణం బయటపడదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సాగునీటి, ఆయకట్టు శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్‌తోపాటు మరో ఇద్దరితో కూడిన ఒక కమిటీని నియమించినట్టు సమాచారం. అయితే ఉన్నతాధికారులెవరూ ఈ కమిటీని వేసినట్టుగా ప్రకటించలేదు. అందువల్ల రహాస్య అధ్యయనమేమైనా జరగనుందా ? అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.
ఏడు లింకులు..28 ఫ్యాకేజీలు
ఏడు లింకులు 28 ప్యాకేజీలతో కాళేశ్వరంను నిర్మించారు. మొత్తం అప్పులతోనే చేపట్టారు. దాదాపు రూ. 80,190 కోట్లతో ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 13 జిల్లాలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. గోదావరితోపాటు ప్రాణహిత నదుల నీటితో ఆయకట్టును తడపాలని ప్రభుత్వం భావించింది.240 టీఎంసీల నీటికిగాను 195 టీఎంసీలు లక్ష్మి బ్యారేజీ నుంచి, 20 టీఎంసీలు శ్రీపాద-ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి, మరో 25 టీఎంసీల నీళ్లు భూగర్భజలాల ద్వారా సమకూరుతాయని అంచనా. ఈ నీటిలో 169 టీఎంసీలను సాగునీటికి, 30 టీఎంసీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు, 16 టీఎంసీలను పరిశ్రమలకు 10 టీఎంసీలను ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాల తాగునీటికి వాడాలని సర్కారు నిర్ణయించింది. 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు 17 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థీరీకరణకు కాళేశ్వరంను ఉపయోగించుకోవాలని సర్కారు ప్రణాళిక.
అప్పట్లోనే..
కాళేశ్వరం నిర్మిస్తున్న సమయంలోనే అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటించడం లేదనీ, పర్యావరణ ప్రమాణాలను తుంగలో తొక్కారనే ఆందోళనా వ్యక్తమైంది. కేసులు సైతం అయ్యాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా రికార్డు సమయంలో నిర్మించామనే పేరుకోసం అడ్డదారులు తొక్కినట్టు ప్రస్తుత పిల్లర్లకు పట్టిన పగుళ్లే చెపుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి చోటుచేసుకుందనే విమర్శలూ తక్కువేంకాదు. ఇప్పుడీ వంతెన కుంగిపోవడంతో ఆ ఆరోపణలు, విమర్శలకు బలంచేకూర్చినట్టవుతున్నది. ఇంజినీరింగ్ అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఆకాశానికెత్తిన ప్రభుత్వంలో, ఇప్పుడు బ్యారేజీ కుంగిపోవడంతో చడీచప్పుడూ లేదు. మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ చేయాలనే డిమాండ్ ప్రతిపక్షాలు, రాజకీయపక్షాల నుంచి వస్తున్నది. వంతెన కుంగిపోవడానికి కారణం నిర్మాణ లోపాలా ? సాంకేతిక వైఫల్యమా ? ప్రమాణాలను నిర్ల్యక్షం చేయడమా ? నిగ్గు తేల్చాల్సిన అవసరమున్నది. అలాగే అవినీతి అధికారులు, తెరవెనుక ఉన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులనూ గుర్తించి కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అయితే లోపాలను గుర్తించి బాధ్యులను పట్టుకునే బదులు, ఆసాంఘీక శక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు పేర గందరగోళపరిచే చర్యలకు స్థానిక అధికారులు పూనుకోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.