కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే నట్టేట ముంచుతారు: ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

నవతెలంగాణ- గంగాధర: కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మితే నట్టేట మునగడం ఖాయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులు ఎక్కువుండగా, గెలిచే సీట్లు తక్కువగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఫైనల్ కాకముందే పది మంది సీఎం అభ్యర్థుల పేర్లు బయటికి వస్తున్నాయని, వెన్నుపోటు రాజకీయాలకు నిలయమైన కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేస్తే దగా చేస్తారని అన్నారు. ఆ పార్టీకి ప్రధాన మంత్రిగా చెప్పుకునే రాహుల్ గాంధీ వస్తే కనీసం కరీంనగర్లో 500 మంది లేరని, గంగాధరలో 200 మంది లేరన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్షని, ఈ ఎన్నికల్లో రాష్ట్రాన్ని, సీఎం కేసీఆర్ ను  ప్రజలు కాపాడుకుంటారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే పేదోన్ని కొట్టి పెద్దోడికి దోచి పెడతారని, అదే బీఆర్ఎస్ అధికారంలో ఉంటే  సంపద పెంచి పేదలకు పంచడమే కేసీఆర్ ఆలోచన విధానం, లక్ష్యం అన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోది ఎలా అమ్మేస్తున్నారో, ప్రైవేటు పరం చేస్తున్నారో ప్రజలే గ్రహిస్తున్నారని అన్నారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యమని, ఎన్నిక వేళ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ ఘటన వెనక కుట్ర కోణం దాగి ఉందని, భారీ వరదలకు తట్టుకున్న పిల్లర్లు ఎన్నికలకు ముందే కుంగడం వెనుక అనుమానాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందన్నారు. సబ్బండ వర్గాల  ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా మేనిఫెస్టో ఉందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు. తెల్లరేషన్ కార్డున్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద రూ.5 లక్షలు బీమా ఇవ్వడం, ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తామనడం, ప్రతి పేదింటి మహిళకు రూ.400 లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారనే విషయం విషయం ప్రజలు గ్రహించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఆసరాను రూ.5 వేలకు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచడం అభాగ్యులకు ఆర్థిక భరోసా నిస్తుందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పంటపెట్టుబడి సాయాన్ని రూ.16 వేలకు పెంచడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ శ్రీరాం మధూకర్, ఏఎంసీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, సింగిల్ విండో చైర్మన్లు వెలిచాల తిరుమలరావు, దూలం బాలా గౌడ్, కొండగట్టు ఆలయ ధర్మకర్తలు పుల్కం నర్సయ్య, ఉప్పుల గంగాధర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, సర్పంచులు వేముల దామోదర్, మడ్లపల్లి గంగాధర్, ఆకుల శంకరయ్య, కంకణాల విజేందర్ రెడ్డి, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ పడితపల్లి కిషన్, ఏఎంసి ఉపాధ్యక్షుడు సామంతుల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు ఆకుల మధుసూదన్, అట్ల శేఖర్ రెడ్డి, మహేశుని ఈశ్వరయ్య, వేముల అంజి, భాస్కర్ తోపాటు ఆయా మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.