– రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
– 1100 మందికి దళితబంధు, 3వేల మందికి గృహలక్ష్మి
– ధర్పల్లిలో వంద పడకల ఆస్పత్రికి రూ.33 కోట్లు..
– రోడ్లు, వంతెనలు, చెక్‌డ్యామ్‌లు రూ.606 కోట్లు
నవతెలంగాణ- డిచ్‌పల్లి
తొమ్మిదిన్నర ఏళ్ళ లో గతంలో ఎవరూ చేయనంతగా కోట్లాది రూపాయలతో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ మాజీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఎన్నికల సమయంలో కొందరు కొత్త బిచ్చగాళ్లలాగా మీ వద్దకు వచ్చి మాయమాటలు చెబుతారని వాటిని ఏమాత్రం నమ్మవద్దని ఆయన ప్రజలను సూచించారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని ఆయన కోరారు. బుధవారం నగరంలోని తన నివాసగృహంలో ఆయన డిచ్‌పల్లి విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో అన్ని గ్రామాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు వేశామన్నారు. ఇజ్రాయిల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న మంచిప్ప రిజర్వాయర్ పూర్తయితే బీడు భూములకు సాగునీరందుతుందన్నారు. డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్ వరకు రహదారి విస్తరణ, సెంట్రల్‌లైటింగ్‌తో డివైడర్ మద్య రకరకాల మొక్కల పెంపకం అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. డిచ్‌పల్లి లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ధర్పల్లిలో వంద పడకల ఆస్పత్రి, చీమన్‌పల్లిలో పీహెచ్‌సీ, చెక్‌డ్యామ్‌లు, వంతెనలు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు నిర్మించినట్లు తెలిపారు. జిల్లాలోనే ఎంతో ప్రసద్ధి చెందిన చారిత్రక డిచ్‌పల్లి ఖిల్లా రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పర్యాటలకు సకల సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.63కోట్ల నిధులతో చేపట్టిన మాధవనగర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఆర్‌వోబీ నిర్మాణం పూర్తయితే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు కేవలం మొదటి విడత దళితబంధు పంపిణి చేశారని, కేవలం రూరల్ నియోజకవర్గంలో 1109 మంది లబ్ధిదారులకు మాత్రమే రెండు విడతలుగా దళితబంధు పంపిణి చేసినట్లు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. అలాగే 3వేల మందికి గృహలక్ష్మి కింద ఇంటి నిర్మాణం కోసం మంజూరు పత్రాలు అందజేశామన్నారు.
రూరల్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు..
దళితబంధు 1100 మంది లబ్ధిదారులు.. ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున రూ.110 కోట్లు
గృహలక్ష్మి 3వేల మంది లబ్ధిదారులు.. ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున రూ.90 కోట్లు.
రూ.33.15కోట్ల నిధులతో ధర్పల్లి మండల కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు..
సిరికొండ మండలం చీమన్‌పల్లి లో రూ.2.50కోట్లతో పీహెచ్‌సీ నిర్మాణ పనులు..
సిరికొండ మండల కేంద్రంలో రూ.5 కోట్లతో ఐటీఐ మంజూరు.
డిచ్‌పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు.
డిచ్‌పల్లి నాగ్‌పూర్ గేట్ నుంచి బోర్గాం(పి) వరకు రూ.32 కోట్ల తో రహదారి విస్తరణ, రోడ్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు..
జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో రూ.3.50కోట్లతో సెంట్రల్ లైటింగ్, రోడ్ డివైడర్..
ధర ్పల్లి మండల కేంద్రంలో రూ.6కోట్లతో సెంట్రల్ లైటింగ్, రోడ్ డివైడర్..
ఎస్‌డీఎఫ్, సీడీఎఫ్ నిధులు రూ.46కోట్లతో అభివృద్ధి పనులు..
ధర్పల్లి మండల కేంద్రంలోని చెరువులో టూరిజం శాఖ ద్వారా బోటింగ్ ఏర్పాటు..
రూ.26కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మాణం.
రూ.25కోట్ల కు పైగా సీఎం రిలీఫ్‌పండ్ మంజూరు.
300 మంది మైనార్టీ లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున రూ.3కోట్లు మైనార్టీబంధు..
200 మంది బీసీ లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున రూ.2కోట్లు బీసీబంధు మంజూరు.
రూ.670 కోట్ల తో నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ, పీఆర్ రోడ్లు, వంతెనలు నిర్మాణం.
మున్సిపాలిటీ నిధులు రూ.37కోట్లు.
రూ.78.20కోట్ల తో రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం.
వీటికి తోడు రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబీమా, గొర్రెల పంపిణి తదితర పథకాలకు రూ.1500 కోట్లకు పైగా నిధులు వెచ్చించినట్లు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు.