దేశంలో విద్యుత్‌ వాడకం పెరుగుతోంది

Electricity usage is increasing in the country– 2050 నాటికి ప్రపంచంలోనే అత్యధిక వినియోగం
– వరల్డ్‌ ఎకనమిక్‌ ఔట్‌లుక్‌ నివేదిక
న్యూఢిల్లీ : రాబోయే మూడు దశాబ్దాలలో మన దేశం ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను వినియోగించే దేశంగా నిలుస్తుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) విడుదల చేసిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఔట్‌లుక్‌ నివేదిక తెలిపింది. 2050 నాటికి మొత్తం ఆఫ్రికాలో కంటే మన దేశంలోనే విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుందని వివరించింది. నివాస గృహాలలో ఏసీల వినియోగం పెరగడమే దీనికి కారణం. నివేదిక అంచనాల ప్రకారం మన దేశంలో ఇంధన సరఫరా 2022లో 42 ఎక్సాజౌల్స్‌ (ఈజే)గా ఉండగా అది 2030 నాటికి 53.7 ఈజేగా, 2050 నాటికి 73 ఈజేగా పెరుగుతుంది. మన దేశంలో గత ఐదు దశాబ్దాల కాలంలో 700 వడగాల్పులు వీచాయి. వీటి కారణంగా 17 వేల మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో ఏసీల వాడకం గణనీయంగా పెరగబోతోంది. వాస్తవానికి 2010తో పోలిస్తే ఏసీల వాడకం మూడు రెట్లు పెరిగింది. ప్రతి వంద కుటుంబాలలోనూ 24 కుటుంబాలలో ఏసీలు ఉన్నాయి. ‘చల్లదనం పొందాలంటే ఏసీలు వాడాలి. అప్పుడు విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది. విద్యుత్‌ వినియోగం ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. భారత్‌లో ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు దాటాయి. దీంతో విద్యుత్‌ వినియోగం ఇప్పటికే పెరిగింది’ అని ఐఈఏ తెలిపింది. 2050 నాటికి దేశంలో ఏసీల వినియోగం తొమ్మిది రెట్లు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మిషన్ల వినియోగం కూడా పెరుగుతోందని తెలిపింది. కాగా చమురుకు డిమాండ్‌ కూడా పెరుగుతోంది. 2022లో రోజుకు 5.2 మిలియన్‌ బ్యారల్స్‌ చమురును వినియోగించగా అది 2030 నాటికి 6.8 మిలియన్‌ బ్యారల్స్‌కు, 2050 నాటికి 7.8 మిలియన్‌ బ్యారల్స్‌కు చేరుతుందని నివేదిక అంచనా వేసింది.