– నరకడాలు..నగంగా ఊరేగించడాలు సంస్కృతా?
– రాయలసీమలోనూ నరుక్కుని చస్తున్నారు..ఆడా పెట్టండి
– బండారు విజయలక్ష్మికి వీహెచ్ సూచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘తలలు నరకేయడాలు..మహిళల్ని నగంగా ఊరేగించడాలేంటి? ఇదేం సంస్కృతి? అక్కడి తెగల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మణిపూర్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం పెట్టండి’ అని ఆ కార్యక్రమ నిర్వాహకులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కూతురు విజయలక్ష్మికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సూచించారు. అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, సత్యపాల్ సింగ్ బాగేల్, ఎల్. మురుగన్, మీనాక్షి లేఖి, మురళీధరన్, బీజేపీ జాతీయ నాయకులు ప్రకాశ్ జవదేకర్, మిజోరం గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు, గుజరాత్ గవర్నర్ దేవవారత్, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణనన్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీసీ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కృష్ణమోహన్, బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్షనేత కె.కేశవరావు, కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఎమ్మెల్సీ యగ్గె మల్లేశం, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ లక్ష్మణ్, సినీరచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్, తుల ఉమ, తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ..ఏపీలో రాజకీయ హత్యలు పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికోసమే మనం నరుక్కుని చంపుకోవడం సరిగాదన్నారు. రాయలసీమలో కూడా అలరుబలరు పెట్టాలని కోరారు. తెలంగాణలో ఆ సంస్కృతి లేదన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేసుకుని ఆ తర్వాత అందరూ కలిసి మెలిసి ఉంటారని చెప్పారు. తెలంగాణలో 17 ఏండ్ల నుంచి దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనీ, ఆయన్ను అలరుబలరు దత్తన్న అని పిలవాలన్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ..కులమతాలకతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దసరా సందర్భంగా అందర్నీ ఒకే వేదికపైకి తీసుకురావడం తనకు చాలా సంతోషానిచ్చిందన్నారు. అలరుబలరుకు వచ్చిన అతిథులందరూ మాట్లాడారు. వారిని అలరుబలరు ఫౌండేషన్ సభ్యులు సత్కరించారు. వారికి అంబలి పోశారు. ఆయా కళలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనలు చేశారు. దత్తాత్రేయ కూడా కళాకారుల వాయిద్య పరికరాలను తీసుకుని వాయించారు. కళాప్రదర్శనలతో అక్కడ ఉత్తేజపూరిత వాతావరణం నెలకొంది.