– లండన్ మేయర్ స్వతంత్ర అభ్యర్థి తరుణ్ గులాటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లండన్ నగరం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తన ముందున్న కర్తవ్యమనీ, వాటి పరిష్కారం కోసం మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు భారతీయ సంతతికి చెందిన తరుణ్ గులాటి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్జర్వేటివ్ పార్టీ మాజీ సభ్యులు గులాటీ మాట్లాడుతూ పార్టీల్లో ఉంటే విధానపరంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆంక్షలుంటాయనీ, అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. లండన్ నగరం నిరుద్యోగం, తక్కువ ఆదాయం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నదని తెలిపారు. వీటితో పాటు విద్యాభ్యాసం కోసం వచ్చే భారతీయ విద్యార్థుల భద్రత కూడా తన ప్రాధాన్యత అని తెలిపారు. లండన్ నగరంలో అన్ని దేశాల ప్రజలున్నారనీ, ఓటర్లలో నాలుగు నుంచి ఐదు శాతం మంది భారతదేశం నుంచి వచ్చిన ఓటర్లున్నారని చెప్పారు. బరిలో నిలుస్తున్న అభ్యర్థులు నచ్చక పోలింగ్ శాతం పడిపోతున్నదనీ, తాను నిలబడటం ద్వారా అది కూడా పెరుగుతుందని తెలిపారు. బీజేపీ మహిళా విధానాలు, పరిశోధనా విభాగం ఇంఛార్జ్ కరుణాగోపాల్ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నమ్మే భారతీయ సంతతికి చెందిన వాడిగా గులాటీకి ప్రతి ఒక్కరు మద్ధతివ్వాలని కోరారు.