నవతెలంగాణ- తిరుమలగిరి:
ఈ నెల 29, 30 తేదీలలో హైదరాబాదులో జరగనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర రెండవ మహాసభలను జయప్రదం చేయాలని గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించి మాట్లాడుతు దేశవ్యాప్తంగా ఉన్న యువత యొక్క శక్తి సామర్ధ్యాలను, పాలకులు సద్వినియోగం చేసుకుంటే, భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల దాటినా నేటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉండటం విచారకరమని, అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారతదేశం ఇంకెప్పుడు చోటు సంపాదించుకుంటుందని ఆయన ప్రశ్నించారు. పాలకుల యొక్క అస్తవ్యస్త విధానాల వల్ల యువశక్తి నిర్వీర్యమైపోయిందని , చదువుకునేందుకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని, కొద్ది శాతం విద్యార్థులు చదువుకొని ఉంటే వారికి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నారని యువతకు నైపుణ్యం ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాన్ని వాడుకుంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశపు మిన్నగా నిలుస్తుందని, యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుంటే మాదకద్రవ్యాల నిషేధం చేయలేకపోతున్నారని, యదేచ్చగా బీర్లు బార్లు, బెల్ట్ షాపులు గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా యువతకు అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా మద్య నిషేధం అమలు చేయాలని, కానీ తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కేవలం మద్యం మీద వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఇది అత్యంత బాధాకరమైన పరిస్థితి అని ఆయన అన్నారు.ఈ మహాసభల్లో యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పట్ల చర్చించి పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నామని, ఈ మహాసభలకు జాతీయ నాయకుల హాజరవుతున్నారని మహాసభల విజయవంతానికై ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పయాజ్, తిపిరాల శ్రీకాంత్, ముత్యాల యాకస్వామి, మల్లయ్య, సత్తయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.