– సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ళ భాస్కర్
నవతెలంగాణ-తుర్కయంజాల్
సీపీఐ(ఎం) పార్టీ రంగారెడ్డి జిల్లా ఉద్యమ నిర్మాతలు, బడుగు బలహీవర్గాల ఆశా జ్యోతులు కామ్రేడ్ మహబూబ్ పాషా, నరహరిల 34వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి కాడిగళ్ళ భాస్కర్ తుర్కయాంజాల్ మున్సిపాలిటీ రాగన్నగూడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాషా, నరహరి స్ఫూర్తితో ప్రజా, కార్మిక పోరాటాలు నిర్వహించాలన్నారు. దున్నేవానికి భూమి కావాలని, వెట్టి చాకిరి, అంటరానితనంపై అనేక పోరాటాలు నిర్వహిస్తు ప్రజలను చైతన్యం చేస్తున్న కామ్రేడ్ మహబూబ్ పాషా, నరహరిని 1989లో భూస్వామ్య శక్తులు హత్య చేశాయన్నారు. ప్రజల మన్నలు పొందుతు అనేక గ్రామాల్లో పోరంబోకు, గైరాన్, అసైన్మెంట్ భూములు పేదలకు పంచిన చరిత్ర వారికి ఉందని గుర్తు చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా పాషా పార్టీని విస్తరిస్తూ అనేక ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్న తరుణంలో మంచాల మండలం ఎంపీపీగా నరహరిని అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా ఎన్నికై ప్రజలకు నిస్వార్ధ సేవ చేశారన్నారు. పాషా, నరహరి, కమ్యూనిస్టు పార్టీ ఎదుగుదలను సహించని కాంగ్రెస్, మతోన్మాదం ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు 1989 అక్టోబర్ 26న లింగంపల్లి గేటు వద్ద దారి కాచి అతి దారుణంగా హత్య చేశారన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, జిల్లా కమిటీ సభ్యులు గొరేంకల నర్సింహ, నాయకులు యం సత్యనారాయణ, ఐ భాస్కర్, జే ఆశీర్వాదం, బి శంకరయ్య, ఆర్ ప్రశాంత్, కుంచెం వెంకటకృష్ణ, తోడే కృష్ణ కుమార్, మండల విజరు కుమార్, దోమలపల్లి శ్రీధర్, మద్దెల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.