రైతులే ముఖ్యం

Farmers are important– రాహుల్‌గాంధీకి రైతులకు మధ్య ఎన్నికలు : మీడియా చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-నిజామాబాద్‌ సిటీ
కాంగ్రెస్‌ నాయకులకు రాహుల్‌గాంధీ ఉంటే.. తమకు రైతన్నలు ఉన్నారని, రైతులకంటే తమకు ఎవరూ ఎక్కువ కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ”గాలివానలో.. వాన నీటిలో.. పడవ ప్రయాణం” అనే పాటను ఉచ్చరిస్తూ కాంగ్రెస్‌ పార్టీని ఆమె విమర్శించారు. గురువారం నిజామాబాద్‌ నగరం కేసీఆర్‌ కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో రాహుల్‌ గాంధీ వర్సెస్‌ రైతన్నల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, రైతుబంధును ఆపేయాలని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఆపాలని, దళితబంధు ఆపాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్‌ను కోరడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలు ఆపుతూ వెళ్లాలంటే ముందు కరెంటు కట్‌ చేయాలని, ఆ తర్వాత మిషన్‌ భగీరథ నీళ్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ ఆపాల్సి వస్తుందని, వాటిని ఆపడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. పదేండ్ల నుంచి నడుస్తున్న పథకాలు కొత్తవని భావిస్తుంటే కాంగ్రెస్‌ ఎంత అభద్రతా భావంలో ఉందో అర్థమవుతుందని మండిపడ్డారు.
ఎప్పటినుంచో అమలవుతున్న పథకాన్ని నిలిపివేయించి రైతులను బాధపెడితే కాంగ్రెస్‌ పార్టీకే నష్టం జరుగుతుందన్నారు. రైతులకంటే ఎవరూ ఎక్కువ కాదని, రైతులను ఇబ్బంది పెట్టి తాము సాధించేది ఏమీ లేదని, కాబట్టి రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ను నాలుగు నెలల క్రితమే నిలిపివేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నేత మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ కామారెడ్డి నుంచి పారిపోయి నిజామాబాద్‌కు వస్తున్నారని, ఆయన ముఖం చూసి కాకుండా పార్టీలను చూడాలని విజ్ఞప్తి చేశారు. మైనారిటీలను కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే చూసింది కానీ మైనారిటీల అభివృద్ధికి ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గత రెండు ఎన్నికల్లో 9కి 9 సీట్లను బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుందని, ఈసారి అన్ని స్థానాలను గెలిపించడానికి తామందరం కష్టపడుతున్నామని చెప్పారు. వందకు పైగా సీట్లు సాధిస్తామన్న విశ్వాసం ఉందని స్పష్టం చేశారు.
ఒక్కొక్క గ్రూపు సీఎం కేసీఆర్‌కు దగ్గరవుతూ వచ్చిందే తప్ప ఏ ఒక్కరూ దూరం కాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గమనించడం లేదని, అందుకే వాళ్లు అందరికీ దూరమవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను తాము కాపీ కొట్టామని ఆ పార్టీ నాయకులు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని, బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు బీఆర్‌ఎస్‌ పార్టీ చేసినంత ఎవరు చేయలేదని, అందుకే ఇది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదు బీసీల ప్రభుత్వం అని చెప్పుకుంటామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాలిత రాష్ట్రాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ ప్రకటించారో ఆ పార్టీ నాయకులు చెప్పాలని సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన అన్ని పరీక్షా పత్రాల లీకేజీలు, మాస్‌ కాపీయింగ్‌లు, అవినీతి, కుంభకోణాలు, ఉద్యోగాల పేరిట జరుగుతున్న స్కాములు, యువకులను మోసం చేయడం వంటివి తెలంగాణలో ఏ ఒక్కసారి జరగలేదని సుస్పష్టం చేశారు.
కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ అరవింద్‌ను తమ పార్టీ కార్యకర్తలే వందకు 150 శాతం ఓడగొడుతామని, అందులో ఎటువంటి సందేహమేలేదని తేల్చిచెప్పారు. కోరుట్లకే కాకుండా మొత్తం నిజామాబాద్‌ పార్లమెంటులో అరవింద్‌ చేసిందేమీ లేదని అన్నారు. ప్రచారంలో తమ పార్టీ చాలా ముందుందని, పార్టీ ఎజెండా, మేనిఫెస్టో, సీఎం అభ్యర్థి వంటి విషయాల్లో తమకు చాలా స్పష్టత ఉన్నదని తెలిపారు.