– ఒకరు పోయిరాగానే మరొకరు..
– ఆహ్వానించి.. శాలువాలు కప్పి…
– తప్పని స్థితిలో ఆత్మీయ సమ్మేళనాలు..
– ప్రముఖుల ఇండ్ల చుట్టూ అభ్యర్థుల చక్కర్లు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
”డాక్టర్ గారూ మీ ఇంటికి వస్తున్నాం.. పెద్దాయన ఇంటికి రమ్మంటారా..? అన్నా మీరేమంటారు..? లాయర్ గారూ రమ్మంటారా.. వద్దంటరా? అక్కా.. ఇవ్వాళ టిఫిన్ మీ ఇంట్లోనే.. అంకుల్ మనోళ్లందర్నీ కూడగట్టండి.. మాటాముచ్చట చెప్పుకుందాం.. సాధక బాధకాలు మాట్లాడుకుందాం.. మనింటి దగ్గరే ఓ చిన్నపాటి మీటింగ్ పెట్టుకుందాం..” ఇవీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు, వారి తరఫు నేతలు, పీఏల నుంచి పలువురు ప్రముఖులకు వస్తున్న ఫోన్‌లు. ముఖ్యంగా పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లోని వ్యాపారులు, డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగ సంఘాల నేతలు, వివిధ వర్గాల ప్రముఖులకు ఎదురవుతున్న ఉదంతాలు. పార్టీతో సంబంధం లేదు.. భావజాలంతో పనిలేదు.. ఆయన చెబితే ఓ పది ఓట్లు పడతాయంటే చాలు.. ఆ ఇంటి దగ్గర వాలిపోవడం.. నలుగురిని పిలిపించమనడం, ఆత్మీయ సమ్మేళనం పేరుతో చిన్నపాటి మీటింగ్ పెట్టడం, ప్రత్యర్థిపై విమర్శలు చేయడం.. పలుచోట్ల నిత్యకృత్యంగా మారింది. ఖమ్మం నియోజకవర్గంలో పదిరోజులుగా ఈ తంతు ప్రహసనంలా సాగుతోంది.
ఈయనొచ్చి పోయిన గంటలోనే ఆయన…
ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా భావిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఓ వారం పదిరోజులుగా నగరంలోని ప్రముఖుల ఇండ్ల్లన్నీ చుట్లేస్తున్నారు. తుమ్మల ఓ ఇంటికి వెళ్లాడని తెలిసిన గంట.. రెండు గంటల్లోనే.. కుదరకపోతే మరుసటిరోజైనా అజరు ఆ ఇంటికి వెళ్లాల్సిందే. ఆ ప్రముఖుడు బీఆర్‌ఎస్ అభిమానా? కాంగ్రెస్ పార్టీనా? బీజేపీనా? కమ్యూనిస్టా? ఇవేవీ సంబంధం లేదు.. ఆయనొచ్చాడు కదా..! నేనూ పోవాల్సిందే..! అనే రీతిలో ఈ వ్యవహారం సాగుతోంది. చేసేది లేక ఎవరొచ్చినా ఆహ్వానించడం మినహా ప్రముఖులు అభ్యంతరం చెప్పలేకపోతున్నారు. గతంలో సదరు నేతలతో ఇబ్బంది పడ్డా.. భవిష్యత్తు అవసరాల రీత్యా కాదనలేని దుస్థితి. ‘నువ్వొస్తానంటే..మేమొద్దంటామా..!’ అన్నట్టు పలువురు ఇష్టంలేకున్నా శాలువాలు కప్పి స్వాగతిస్తున్నారు. తమ పరిధిలో పనిచేసేవారినో.. చుట్టుపక్కల వాళ్లనో.. అపార్ట్‌మెంటైతే దానిలోని ప్లాట్లలో ఉండేవారిని పిలిపించి.. ఇష్టాఇష్టాలతో పనిలేకుండా మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులు చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలు, లేని ఆత్మీయ అభిమానాల ప్రదర్శనతో విసిగివేసారుతున్నా భరించక తప్పని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇది ఇక్కడే కాదు.. పలు పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల్లోనూ పది ఓట్లను ప్రభావితం చేయగల వారికీ ఎదురవుతున్న అనుభవం ఇదే.
‘ఓటు’ కోసం కోటి విద్యల రీతిలో..
ఖమ్మంలో ప్రముఖ వ్యాపారవేత్త జీవీ మాల్ అధినేత గుర్రం బ్రదర్స్ ఇంటికి తుమ్మల వెళ్లారు. ఆ వెంటనే అజయ్ కూడా వెళ్లొచ్చారు. విద్యాసంస్థల అధినేత, సీపీఐ నాయకులు సాంబశివారెడ్డి ఇంటికి తుమ్మల వెళ్లారు. ఒకటి, రెండు రోజుల తర్వాత అజరు హాజరువేసుకున్నారు. సీపీఐ(ఎం) నేత, మాజీ ఎంపీ యలమంచలి రాధా కృష్ణమూర్తి కుమారులు రవీంద్రనాథ్ ఇంటికి తుమ్మల వెళ్లి వచ్చిన గంటల్లోనే అజయ్ ప్రత్యక్షం అయ్యారు. మొన్న ప్రముఖ కాంట్రాక్టర్ మేళ్లచెరువు (ఆర్టీసీ) వెంకటేశ్వరరావు ఇంటికి కూడా ఇదే పరిస్థితి. బీజేపీ సింపథైజర్ లాయర్ మల్లాది వాసుదేవ్ ఇంట్లో అజయ్ ఆత్మీయ సమ్మేళనం, ఆ పక్కనే ఉన్న శ్రీ రక్ష హాస్పిటల్ అధినేత గోంగూర వెంకటేశ్వర్లు ఆస్పత్రికి వెళ్లి అక్కడో ఆత్మీయ సమావేశం.. ఇక అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్‌లో మీటింగ్‌లు షరామామూలే..! ‘ఓటు’ కోసం కోటి విద్యలు అన్నట్టు నేతల వ్యవహారం ఉండటాన్ని చూసి జనం విస్తుపోతున్నారు.