మంచిరెడ్డి హ్యాట్రిక్ విజయం ఖాయం 

– బీఆర్ఎస్ యువ నేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి 
– ఇ.పట్నంలో రెండో రోజు మార్నింగ్ వాక్ 
– విస్తృతంగా బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం 
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్రంలో కేసీఆర్, ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి హ్యాట్రిక్ విజయం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర యువనేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. తన మార్నింగ్ వాక్ లో భాగంగా  ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని వెంకటరమణ కాలనీలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అభివృద్ధి చేసిన ఘనత మంచిరెడ్డి కిషన్ రెడ్డికే దక్కిందని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలోనే  రూ.5లక్షల జీవిత బీమా, అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం, ఇప్పుడున్న ఆసరా పింఛన్లను రూ.5016, వికలాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచుతామని వివరించారు. రైతుబంధు రూ.16 వేల చొప్పున మొదటి ఏడాది నుంచి రూ.12000, ఐదేళ్లలో రూ .16 వేలకు పెంచుతామని గుర్తు చేశారు. ప్రతి నియోజకవర్గంలో అగ్రవర్ణ పేదలకు సైతం గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంచుతామన్నారు. అర్హులైన పేద కుటుంబాల మహిళలకు జీవన భృతి కింద సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా రూ.3వేలు అందజేస్తామని చెప్పారు. రూ.400 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నామని ప్రకటించారు. మహిళా సమైక్యలకు సొంత భవనాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, గృహలక్ష్మి ద్వారా రూ.3లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వివరించారు. అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేసి అవసరమైనప్పుడు విక్రయించుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు సిపిఎస్ పై  అధ్యయన కమిటీ వేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పటికే అందజేస్తున్న సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. మరోసారి రాష్ట్రంలో కేసీఆర్, ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సీసీ రోడ్ల వ్యవస్థతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని సైతం 90శాతం పూర్తి చేయగలిగామన్నారు. మిగిలిన పనుల పూర్తి చేసేందుకు ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని అందులో కొన్ని ప్రారంభం కాగా, మరికొన్ని పనులు ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయని చెప్పారు. వాటిని సైతం ఎన్నికల అనంతరం ప్రారంభిస్తామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మాజీ చైర్మన్ భరత్ కుమార్, కౌన్సిలర్లు సుధాకర్, బాలరాజ్, జగన్, నాయకులు జగదీష్, రవీందర్, కొండ్రు ప్రవీణ్, శంకర్ నాయక్, నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్, ముత్యాల చిన్న, జెర్కొని రాజు, జలంధర్, శివ సాయి తదితరులున్నారు.