
– జర్నలిస్ట్ వృత్తితో పాటు సమాజ సేవలో..
– కరీంనగర్ పోలీస్ అధికారులతో ఉత్తమ ప్రశంసలు
నవతెలంగాణ- బెజ్జంకి: రక్తదానం.. మహా దానమంటారు పెద్దలు. నేటి రోజుల్లో అన్ని దానాలలోకెళ్ల రక్తదానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందరో అభాగ్యులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమవుతుండడంతో రక్తదానం మహాదానమనే విధానంతో పోలీస్ శాఖ అధ్వర్యంలో ప్రత్యేక రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. యువకులు స్పందించి పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేస్తున్నారు. సుమారు గత 15 ఎండ్లుగా ప్రతి యేటా పోలీస్ శాఖ అధికారులు నిర్వహిస్తున్న రక్తదాన శిభిరంలో మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామానికి చెందిన తడకపల్లి రవీందర్ విరివిగా రక్తదానం చేసి పోలీస్ అధికారులతో ప్రశంసలందుకుంటున్నాడు. సమాజంలో ఎవరెమైతే నాకంటనే బావనతో కనీస మానవత్వం మరిచిపోతున్న ఈ రోజుల్లో ప్రతియేటా రక్తదానం చేస్తూ ప్రాణదాతగా ప్రశంసలందుకుంటూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు తడకపల్లి రవీందర్.