అణచివేతలు – ఆక్రమణలు ఉన్నప్పుడు తిరుగుబాట్లు – ప్రతిఘటనలు తప్పవు. అవి హింస అయితే ఇవి కూడా హింస అవుతాయి. రాజ్యహింసకు ప్రతిహింస చెలరేగకమానదు. ఆత్మ రక్షణా పోరాటం అనేది మానవ స్వభావంలోనే ఉంటుంది. ఒక్కో సారి ఈ దాడులు- ప్రతిదాడులు చిలికి చిలికి గాలివానగా మారి యుద్ధరూపాలుగా సంతరించుకుంటాయి కూడా.
అందుకే ఇజ్రాయల్ – పాలస్తీనా యుద్ధ పోరును తక్షణం భేషరతుగా శాంతింపజేయాలని ప్రపంచ మానవాళి కోరుకుంటున్నది. యుద్ధం జరు గుతున్న వేళ అమాయిక ప్రజలు వేలాదిగా ప్రాణా లు కోల్పోవడం, క్షతగాత్రులు గావడం, కొంపా గోడు వదలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ పారిపోవడం, చూస్తుండగానే కట్ట డాలు నేలమట్టం కావడం అంతా క్షణాల్లో జరిగి పోతుంది. ఈ భయంకర విధ్వంసం క్షణక్షణం పెర గడమేకాదు, ఇతర ప్రాంతాలకూ ఈ యుద్ధం విస్తరి స్తుంది. యుద్ధజ్వాలలు, దావాగ్నిలా మారకముందే ఆర్పడం విచక్షణకు పరాకాష్ట.
శవాలపై బొగ్గులు ఏరుకున్న చందంగా కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనం కోసం ఈ యుద్ధ మంటల్లో సైతం చలికాచుకోడానికి వెనుకాడరు. అందుకే అన్నాడు మహాకవి శ్రీశ్రీ ‘బలవంతుడు బలహీనుల దుర్భలు గావించిరి.నరహంతకులే ధరాధిపతులై చరిత్ర ప్రసిద్ది కెక్కిరి’
ఎప్పటికప్పుడు వారు తమ పబ్బం గడుపుకుంటూ మీనమే షాలు లెక్కిస్తుంటారు. ఉగ్రవాదాన్ని కేవలం ఆయుధాలతో అణ చివేయగలమని మూర్ఖత్వంతో వెర్రిప్రేలా పనలు పేలుతుం టారు. ఉగ్రవాదం పుట్టుకకు, పెరుగుదలకు తామూ పరోక్ష కారకులమన్న విషయమే తెలుసుకోరు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటిరెస్ ఈ విషయంలో సరిగానే స్పందించారు. ఇజ్రాయిలుపై పాల స్తీనా ప్రజాపోరు సంస్థ ‘హమాస్’ దాడి (20 రోజుల క్రితం) ఒక్కసారిగా జరిగింది కాదని, శూన్యం నుండి అకస్మాత్తుగా ఊడిపడిన పిడుగుపాటు అసలేకాదని కుండబద్దలు కొట్టారు. ఐ.రా.స దినోత్సవ సందర్భంగా భద్రతా మండలి మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడుతూ తన ఆవేదనను వెలిబుచ్చారు.
‘ఇజ్రాయిల్ ఆక్రమణలతో గత 56 ఏళ్ళుగా పాలస్తీనియులు అణచివేతకు గురౌతున్నారు. సెటిల్‌మెంట్లు, దందాలు, భయపెట్టే హింసాత్మక చర్యలతో వారు తమ భూమిని కోల్పోయారు. ఇళ్ళు లేక నిరాశ్రయు లయ్యారు. తమ సమస్యకు న్యాయమైన పరి ష్కారం లభిస్తుందనే ఆశను వారు కోల్పోయారు. అందుకే హమాస్ దాడులు. అయితే దాడులు పరి ష్కారం కాదు. అదే సందర్భంలో హమాస్ దాడు లు చేసిందనే పేరుతో పాలస్తీనియులను యుద్ధ రూపేణా శిక్షించాలని ఇజ్రాయిలు నేతలు భావిం చడం సరికాదు. సమర్థనీయంకాదు, తక్షణం యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పండి అని విజ్ఞప్తి చేసారు. ఇరుదేశాల ఏర్పాటు (ఇజ్రాయిల్-పాల స్తీనా) మాత్రమే సమస్యకు పరిష్కా రమని ఆయన సూచించారు.
యూదు వ్యతిరేకతను, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే స్వమత ఛాందసశక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఉద్భోధించారు. ఇజ్రాయిలు వారు తమ రక్షణ కోసం నిర్మాణాత్మ కంగా వ్యవహరిం చాలని, అదేవిధంగా పాలస్తీనియులు తమ స్వతంత్ర దేశ ఆకాంక్షలు నెరవేరేలా హమాస్ ఆచితూచి అడు గేయాలని కోరారు. ఉభయులు ఆంతర్జాతీయ ఒప్పం దాలను గౌరవించి నడుచుకోవాలని, లేని పక్షంలో క్షణక్షణం గాజా పరిస్థితి యుద్ధ ఊబిలో కూరుకుపో తుందని హెచ్చరించారు. యుద్ధం పశ్చిమాసియా అంతటా విస్తరించే పెను ప్రమాదం ఎంతో దూరం లో లేదని, దగ్గర్లోనే పొంచి ఉన్నదని, మరిన్ని ప్రాణా లు బలికాకముందే మేలుకొమ్మని నేతలకు సూటిగానే చెప్పారు.
గాజాలో పౌరులు, పసిపిల్లలు నేలకొరగడం, కట్టడాలు నేలమట్టం కావడం క్షంతవ్యం కాదని అంటూనే పౌరులను రక్షించడం అంటే యుద్ధ ప్రాం తాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు కట్టుబట్టలతో పారి పొమ్మని చెప్పడం కాదని చురకంటించారు. సరైన ఆశ్రయము, ఆహారం, నీరు, విద్యుత్, మందులు లేకుండా శరణార్థులు ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు? కాగా ఆ శరాణా ర్ధుల శిబిరాలపై, ఆస్పత్రులపై కూడా బాంబులు వేయడం ఏం యుద్ధనీతి? ఏం మానవీయత? అని కూడా ఆక్రోశించారు.
బ్రెజిల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఇజ్రాయిల్, పాల స్తీనా మంత్రులతో పాటు అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల మంత్రులు పాల్గొనడం గమనార్హం
ఈజిప్టు-మధ్యధరా సముద్రం మధ్యన ఉండే పాలస్తీనీ యుల గాజా ప్రాంతం 41 కి.మీ. పొడవు 20 కి.మీ. వెడల్పు గల చిన్న భూభాగం అది. కేవలం 23 లక్షల జనాభా. ఒంటె – గుడారం కథ మాదిరి యూదులు పాలస్తీనా భూ భాగాన్ని ఇజ్రా యిల్‌గా ఆక్రమించుకున్నారన్న విషయం ఎల్లరకూ తెలిసిందే. అమెరికా, దాని మిత్రదేశాలు పాలస్తీనాను గుర్తించకుండా కేవ లం ఇజ్రాయిల్‌ను మాత్రమే ఒక దేశంగా గుర్తిస్తూ 1948లో ఐక్యరాజ్యసమితిలో ప్రకటన చేయడమే సమస్యకు బీజం. తమ సొంత భూభాగంలోనే తాము పరాయి వాళ్ళుగా, పరాధీనులుగా బ్రతకడం ఎంత నరకమో అది అనుభవించేవారికే తెలుస్తుంది. ఇజ్రాయిల్ సైన్యం అవకాశం దొరికి నప్పుడల్లా పాలస్తీనీయులపై ఆంక్షలను, అణచివేతను ప్రయోగంచడం పరిపాటైపోయింది. చివరకు గాజాలోని అల్‌అఖ్సా మసీదుకు వెళ్ళాలన్నా ఇజ్రాయిల్ సైన్యం అనుమతి తీసుకోవడం వారికి భరింప రాకున్నది.
కనుకనే దీనిని కేవలం రెండు మతాల మధ్య లేదా రెండు ప్రాంతాల మధ్య జరిగే పైపై ఘర్షణగా చూడ రాదని, పాలస్తీనీయుల భౌగోళికమైన ఉనికి, అస్తిత్వం, ఆత్మగౌరవం, మానవ హక్కులు మిళిత మైన ప్రధానమైన సమస్యగా పరిగణించాలనేది విశ్లేషకుల భావన. ఎక్కడైనా, ఎప్పు డైనా శాంతి భద్రత లతో జీవించే స్వేచ్ఛే నిజమైన స్వేచ్ఛ.
అయితే ఈ యుద్ధాన్ని వాడుకుని రానున్న ఎన్నికల్లో లబ్ది పొందాలని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు వ్యూహమని, అందుకే కాల్పుల విరమణకు ముందుకు రావడం లేదని వారు విమర్శిస్తున్నారు.
అక్టోబరు 7న, ఆకాశ మార్గాన, జలమార్గాన, భూ మార్గాన అకస్మాత్తుగా ఇజ్రాయిల్ పై హమాస్ ముప్పేట దాడి జరి గింది. అదీ బాంబుల తూటాల వర్షంతో. ఏం జరిగిందో తెలుసు కునేలోపునే జర గాల్సిందంతా జరిగిపోయింది. వందలాదిమంది నేలకొరిగారు. దాదాపు 200 మందిని బందీలుగా హమాస్ పట్టుకుపోయింది.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో నైపుణ్యం ఉండి, పెగాసిస్ గూఢ చర్యత్వానికి పెట్టని కోటగా నిలిచిన ఇజ్రాయిల్‌కు ఇప్పుడు ఇది మింగుడు పడటంలేదు. ఈ దాడి పట్ల ఇజ్రాయిలేకాదు యావత్ ప్రపంచమే నివ్వెరపోయింది. ఇజ్రాయిల్ పాలకుల నిర్లక్ష్యం అహంభావమే ఈ దాడికి కారణమని పరిశీలకులు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇజ్రాయిల్‌పై ఎప్పటికైనా దాడి చేయాలనే ధృఢ సంకల్పం తో హమాస్ ఉన్నది. గాలిగుమ్మటాలు (పారాగైడిర్) వంటి సాయంతో సహా ఆకాశమార్గాన వచ్చి, దాడిచేసి బందీలను పట్టుకుపోవాలనే ఎత్తుగడలతో హమాస్ ఉన్నట్టు, అందుకు సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్టు దాదాపు పదేళ్ళ క్రితమే వెబ్‌సైట్‌లో కథనం ప్రచురితమైంది. గతంలోని చిన్నచిన్న దాడులకంటే ఇది అనూహ్యమైన పెద్దదాడి. లెక్కలేని ఏమరుపాటుతనం తమ పాలకులకు ఎందుకు వచ్చిందని ఇజ్రాయిలు ప్రశ్నిస్తున్నారు.
దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్, పాలస్తీనా ప్రాంతం గాజా పై యుద్ధం చేస్తుంటే, హమాస్‌కు మద్దతుగా లెబనాన్, సిరి యాల హిజ్భుల్లా మిలిటెంట్లు రంగంలోకి వస్తున్నారు. గాజాను పూర్తిగా ఆక్రమించి, హమాస్‌ను కనుమరుగు చేయాలని ఇజ్రాయిల్ భావిస్తుంటే, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు సన్నాయి నొక్కులు నొక్కుతూ వంతపాడుతున్నాయి.
ఇజ్రాయిల్ హెచ్చరికతో ఉత్తర గాజాలోని పదకొండు లక్షల ప్రజానీకం పిల్లా, మేకాతో దక్షిణ గాజావైపు ఆకలి దప్పులతో వలస పోవడం ఈనాటి మహావిషాదం.
ఆదిలో హమాస్ దాడి పట్ల వ్యతిరేకత వ్యక్తమైనా, క్రమేణా ఇజ్రాయిల్ భీకర యుద్ధదాడుల పట్ల జుగుప్స కలుగుతున్నది. నేతలు ఇంత అమానవీయంగా ఉంటారా! అన్న ప్రశ్న ఉత్పన్న మవుతున్నది. అందుకే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా ఇజ్రాయిల్‌కు మద్దతునిస్తూనే, గాజాపై ఆక్రమణ మంచిది కాదని సలహా ఇచ్చారు. అగ్రదేశాల్లో ఇజ్రాయిల్ సంపన్న యూదుల పెట్టుబడుల దృష్యా ఆ దేశాల మద్దతు తాత్కా లికంగా లభించినప్పటికీ, అంతిమంగా శ్రమించే మానవాళి, మానవత్వమే ప్రపంచ గతికి మూలం అని ఈ నేతలు ఎప్పటికి గ్రహిస్తారో..
కె. శాంతారావు
9959745723