బీజేపీ,బీఆర్‌ఎస్‌లను ఓడించండి

నవతెలంగాణ-తిరుమలగిరి
రానున్న ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించాలని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు కోరారు.శుక్రవారం తిరుమలగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.సీఎం కేసీఆర్‌ నిన్న ప్రకటించిన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలను అధికారంలో ఉండి ఇన్ని రోజులు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.గత వాగ్దానాలను అమలు చేయని ఆయన కొత్త హామీలను అమలు చేస్తామంటే ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు.దళిత,గిరిజనులకు మూడెకరాల సాగు భూమి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి కల్పన, అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, పేదలకు గహలక్ష్మి ఇండ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, గిరిజనులందరికీ పోడు భూమికి పట్టాలు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భతి, 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్‌, గొర్రెల మేకల పెంపకందారులకు గొర్రెల పంపిణీ, బీసీ రుణాలు, మైనార్టీ రుణాలు, పూర్తిస్థాయిలో రైతుల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, రైతాంగానికి ఉచితంగా ఎరువుల పంపిణీ, రైతులకు పంట నష్టపరిహారం, అర్హులైన పేదలందరికీ రేషన్‌ కార్డులు వంటి హామీలను నేటికీ అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారో సమాధానం చెప్పాలన్నారు.పదేండ్లుగా ప్రభుత్వ పథకాల కోసం ‘ఒంటె పెదాలకు నక్క’ఆశపడ్డ చందంగా రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలు కోసం ఇన్నేండ్లుగా ఎదురు చూసి మోసపో యారన్నారు.ఎమ్మెల్యేలకు జీతాలు పెంచిన ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రం ఐఆర్‌ ఇవ్వడం లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బీఆర్‌ఎస్‌, మతోన్మాద బీజేపీని రానున్న ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కన్వీనర్‌ గుమ్మడవెల్లి ఉప్పలయ్య, మండల కమిటీ సభ్యులు కడెంలింగయ్య, కడారి లింగయ్య, రాయల రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.