– పోటీ అనివార్యం : యనమల, అచ్చెన్నాయుడుతో నేతల భేటి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేసే విషయంలో సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం పలువురు టీడీపీ నేతలు జాతీయ నాయకత్వాన్ని కలిశారు. ఈ మేరకు పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నాయకుల బందం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకష్ణుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబును కలిసింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరిలో నిలబడటానికి గతంలో కంటే సానుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించారు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేయడం అనివార్యమని చెప్పారు. పోటీలో ఉండకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో టీడీపీ పోటీలో ఉండటం లేదని మీడియాలో కథనాలు వస్తున్నాయనీ, దీంతో పార్టీ శ్రేణుల్లో ఇప్పటికే అయోమయం నెలకొందన్నారు. దీంతో యనమల, అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సంబం ధించిన అంశాలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దష్టికి తీసుకుపోతామని హామీ ఇచ్చారు. అన్ని స్థానాల్లో కాకుండా పార్టీకి బలమున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే బాగుంటుందని వారు సూచించడం జరిగిందని నేతలు చెప్పారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పొలంపల్లి అశోక్, బిసీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు మేకల భిక్షపతి, ప్రకాష్, రవీంద్రా చారి, నల్లగొండ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
29న చంద్రబాబు మద్దతుగా ‘కాన్సర్ట్’
చంద్రబాబుకు మద్దతుగా గచ్చిబౌలిలో ప్రత్యేక కాన్సర్ట్‌ను తెలుగు ప్రొఫెషనల్స్ నిర్వహించ నున్నారు. హెటెక్‌సిటీ నిర్మించి 25 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో చంద్రబాబుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు ద్వారా లబ్దిపొందిన అందరూ ఈకార్యక్రమానికి ఆహ్వాని తులేనని తెలుగు ప్రొఫెషనల్స్ ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమం సాయంత్రం ఈనెల 29న(ఆదివారం) నాలుగు గంటలకు జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రారంభమవుతుందన్నారు.