ఇచ్చట ఓట్లు…

Here are the votes...స్టాండులోకి బస్సు రాగానే కిటికీలోనుంచి దస్తీ వేసి సీటు రిజర్వు చేసుకున్నట్టు ఎన్నికలు రావడానికి ఆరు నెలల ముందే ఒక నియోజకవర్గానికి ఎం.ఎల్‌.ఎ. సీటుకు రిజర్వేషన్‌ చేసుకున్నాడు ఓంకార్‌ నానా తంటాలు పడి. ఈ లోకంలో నీ అంత అదృష్టవంతుడెవడూ లేడు. నువ్వొక గెలుపు గుర్రానివి. ఫలానా పార్టీ టికెట్టు ఫలానా నియోజక వర్గం… వారెవా నీకు నువ్వే సాటి. నీకెవ్వరు పోటీ అని మునగచెట్టు ఎక్కించారు చుట్టూ వుండే చెక్కభజన గాళ్లు.
కిటికీలోంచి వేసిన దస్తీ కనిపించదు. ఏ సీట్లో వేశామో తెలీదు ఒక్కోసారి. ఖర్మకాలి అదే జరిగింది. చివరాకరి క్షణంలో బి ఫామ్‌ని గద్దలా తన్నుకుపోయేడు మరొకడెవడో. రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన్నాటి నుంచి ఎదుటివాళ్లని ఏడిపించడమే తప్ప తను ఎప్పుడూ ఏడవలేదు ఓంకార్‌. కానీ ఇప్పుడా అవసరం వచ్చింది. అయితే అలవాటు లేని ఏడుపు ఏడవడం అవసరమా అనుకున్నాడు. మళ్లీ ఐదేళ్ల దాకా ఏడుస్తూ వుండడం సాధ్యం కాదని అనుకున్నాడు. అంతే పార్టీ మార్చేశాడు. మరో పార్టీ వాళ్లు కండువా కప్పి తమలో ఐక్యం చేసుకున్నారు.
ప్రాణ విత్త మాన భంగం అప్పుడు, బి ఫామ్‌ కోసమూ పార్టీ మారడం తప్పు కానేకాదని, పదవి ముఖ్యం కానీ పార్టీ కాదని, టికెట్టు రాకపోయినా అదివ్వని పార్టీని పట్టుకు వేలాడ్డం అప్రయోజకులు చేసేపని అని, ఓంకార్‌ ప్రయోజకుడు కనుక సరైన టైంలో భేషైన నిర్ణయం తీసుకున్నాడని, ముందు ముందు అవసరం అయితే దేశంలోని అన్ని పార్టీలలోకి మారైనా సరే ఒక వెలుగు వెలగాలని వెన్ను తట్టారు వెల్‌ విషర్స్‌.
ఎలాగైతేనేం తను నమ్ముకున్న పార్టీ వాళ్లు బి ఫామ్‌ ఇవ్వకుండా ఉత్తి హేడ్‌ ఇచ్చినా మరో పార్టీ వాళ్లు కండువాతో పాటు బిఫామ్‌ ఇవ్వడంతో ఎన్నికల బరిలోకి దిగాడు ఓంకార్‌, ఏం చేసైనా గెలిచి తీరాలనే దృఢనిశ్చయంతో. తనను ఎన్నుకోబోయే నియోజక వర్గం ప్రజలకు సంబంధించిన వివరాలు సేకరించాడు. ఎక్కడ చదువుకున్నవాళ్లున్నారు, ఎక్కడ పనిపాటల వాళ్లున్నారు, ఎక్కడ కులపెద్దల మాట వినేవాళ్లున్నారు, ఎక్కడ మతం ట్రంపు కార్డులా పనిచేస్తుంది, ఎక్కడ నోటు పనిచేస్తుంది, ఎక్కడ నోటిమాట పనికొస్తుంది… వంటి డీటైల్స్‌ తెలిపే ‘గ్రౌండ్‌ వర్క్‌’ పూర్తయింది. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లాలని, మనిషి మనిషినీ పలకరించాలని డిసైడ్‌ చేసుకున్నాడు.
తన నియోజక వర్గంలో అత్యధికంగా ఓట్లు వున్న ఇళ్లు మార్క్‌ చేసుకున్న ఓంకార్‌ ఓ శుభోదయాన మంచి ముహూర్తాన ఓ ఇంటి ముందు సపరివారంగా వాలిపోయాడు. పెద్ద ఇల్లే ఓటర్ల లిస్టులో వున్నట్లు, ఓట్లు కూడా ఎక్కువే అనుకుంటూ గేటు ముందు నిలబడ్డ ఓంకార్‌కి ఓ బోర్డు కనిపించింది. దాని మీద కొట్టవచ్చినట్టున్నవి ‘ఇచ్చట ఓట్లు అమ్మబడును’ అన్న అక్షరాలు.
నమ్మలేకపోయేడు. తను చూస్తున్నవి తేట తెలుగు అక్షరాలేనా అనుకున్నాడు. ఇదేమి చోద్యం అనుకున్నాడు. ముక్కు మీద వేలు వేసుకునేలోపే ఇంటి పెద్ద మరికొందరు ఆడామగలు బిలబిలమంటూ గేటు దగ్గరికి వచ్చేశారు. ఈ బోర్డు ఏమిటి? ఓట్లు అమ్మడమేమిటి? ఇదేమన్నా బాగుందా? అనడిగాడు ఇంటి పెద్దని ఓంకార్‌. మాది ఉమ్మడి కుటుంబం. పాతిక ఓట్లు తేరగా వేయం. మీ మాటలకూ, దండాలకూ ఓ దణ్ణం. ముక్కు సూటిగా అడుగుతాం. ఓటు వేశాక మీరెవ్వరో, మేమెవరమో. ఫలానా పని చెయ్యండని మేం అడగం. మీ పదవి మీ ఇష్టం. మీ పెట్టుబడి, మీ లాభం. మాకూ నీతీ నియమం వున్నాయి. ఒక్కసారి ఒకరికి ఓట్లు అమ్మితే సేల్స్‌ బందు చేస్తాం. అమ్మిన వాటిని మళ్లీ మళ్లీ అమ్మం. అమ్మిన వాళ్లకే నమ్మకంగా ఓట్లేస్తం అన్నాడు ఒంటికి లుంగీ చుట్టుకు వచ్చిన ఇంటిపెద్ద. ఓంకార్‌కి నోట మాట రాలేదు. తను ఇవ్వాలనుకున్న హామీలు, చెప్పాలనుకున్న అచ్చక బుచ్చక మాటలకు ఛాన్నే లేదు. మా వాళ్లు వచ్చి బేరం కుదుర్చుకుంటారు. వస్తా మరి అని బలయల్దేరాడు ఓంకార్‌. పోలింగ్‌ తేదీకి 48 గంటల ముందు వరకే అవకాశం అన్నాడు ఇంటి పెద్ద ఓంకార్‌ వీపు మీద తడుతూ.
ఆ రోజు ముహూర్తం పెట్టుడు ముహూర్తమని, ప్రచారం కల్సిరాదని, మర్నాడు ఉదయాన్నే మరో ఇంటి ముందు అనుచరగణంతో నిలబడ్డాడు ఓంకార్‌. ఈ ఇంటి ముందూ ఓ బోర్డు వుంది. ప్రజలు బాగా తెలివి పట్టి వున్నారు అనుకున్నాడు. బోర్టు మీద తాటికాయల ఆకారంలో ‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు’ అన్న అక్షరాలున్నవి. ఈసారీ ఆశ్చర్యపడ్డాడు ఓంకార్‌ కానీ ఆనందంగా. వీళ్లురా ప్రజలు, వీళ్లురా దేశభక్తులు అనుకున్నాడు. పదిమంది కళకళలాడే ఓటర్లతో పాటు ఒంటికి పైజమా తొడుక్కుని వున్న పెద్ద వచ్చాడు. ఆహా, మీరెంత గొప్పవారు, ఓహో మీరెంత మంచివారు అని స్తోత్రం మొదలుపెట్టాలనుకున్న ఓంకార్‌కు అవకాశం ఇవ్వలేదు ఇంటిపెద్ద. మా ఓట్లూ ఈ బస్తీ ఓట్లూ మేం ఎవరికీ అమ్మం కానీ మా ఓట్లు పడాలంటే మేం చెప్పిన షరతులకు ఒప్పుకుంటూ ఓ బాండు రాసి ఇవ్వాల్సి వుంటుంది అన్నాడు. అవేమిటో చెప్పాడు. ఎన్నికయిన అభ్యర్ధి ఐదేళ్లూ పార్టీ మార్చనని, ఈ పార్టీలోనే వుంటానని, ఎన్నికయ్యాక మళ్లీ అయిదేళ్ల దాకా అడ్రస్‌ లేకుండా పోక, ప్రతి ఆర్నెల్లకు ఒకసారి తమ బస్తీకి వచ్చి క్షేమ సమాచారం కనుక్కోవాలని ఆ బాండులో వుంటుందని, సమ్మతమైతే మళ్లీ రావచ్చని ఇంట్లోకి వెళ్లిపోయాడు ఇంటిపెద్ద.
మర్నాడు మరో ఇంటి ముందు నిలబడ్డ ఓంకార్‌ చెంప చెళ్లుమనిపించింది ‘ఇచ్చట ఓట్లు వేయబడవు’ అన్న బోర్డు. ఇంట్లోంచి బయటకు వచ్చిన షార్టూ, పూల షర్టూ వేసుకున్న ఇంటి యజమాని గబగబా పాట అప్పజెప్పాడు. మా ఇంట్లో డజను పైగా ఓట్లున్నవి కానీ మేం ఎవర్నీ నమ్మం, ఎవరికీ ఓట్లు వేయం, అలాగని ఓట్లు అమ్మం. అమ్మి మీకు రుణపడిపోం. మీ అఘాయిత్యాలకు వత్తాసు పలకం. మాకు తెల్సు అన్ని పార్టీల మనుషుల ముడిసరుకు ఒక్కటే. మేం మేడిపండ్లు పొట్టవిప్పి చూడం. ఎన్నికల రోజు అమెజాన్‌, హాట్‌స్టార్‌లలో సినిమా చూస్తూనో, చీట్ల పేక ఆడుతూనో గడిపేస్తాం కానీ పోలింగ్‌ బూత్‌కి రానేరాం. ఈ వ్యవస్థ మీద, ఈ ఓట్ల జాతర మీద మాకు విశ్వాసం లేదు. మీకూ మాకూ రాం రాం అన్నాడు.
ఇంటింటి ప్రచారం అచ్చిరాలేదనుకున్న ఓంకార్‌ అది మానేసి ఓట్లు కొల్లగొట్టడానికి మరో మార్గం వెతకాలనుకున్నాడు.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212