తొలి మలితరాల్లోనే కాక ఇవ్వాళ్ళ కూడా బాల సాహిత్యం, సాహితీవేత్తలతో పాటు బాలల వికాస కార్యక్రమాలు, కార్యశాలలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు బడి పిల్లల రచనలు, శిల్పశాలలు కూడా ఇందూరులో యివ్వాళ్ల ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తూ కవయిత్రిగా, పరిశోధకురాలిగా, వ్యాస రచయిత్రిగా ముందుకు సాగుతున్న బాల సాహితీవేత్త డా||ఆరుట్ల శ్రీదేవి.
‘ఆరుట్ల శ్రీదేవి వేణుగోపాల్’ పేరుతో సాహితీ లోకంలోకానికి తెలిసిన డా|| ఆరుట్ల శ్రీదేవి 19 జనవరి, 1973న జగిత్యాల జిల్లా కేంద్రంలో పుట్టారు. శ్రీమతి ఆరుట్ల కమలాదేవి, శ్రీ రాజన్న వీరి అమ్మా నాన్నలు. ప్రస్తుతం మెట్టినిల్లు నిజామాబాద్‌లో తెలుగు ఉపాధ్యాయినిగా ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఎం.కాం., తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. పూర్తి చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో ‘అయాచితం నటేశ్వర శర్మ తెలుగు రచనలు-పరిశీలన’ అంశంపై పిహెచ్.డి పరిశోధన చేసి డాక్టరేటు పట్టా పొందారు. సిద్ధాంత గ్రంథాన్ని అచ్చు వేసారు కూడా.
ఆరుట్ల శ్రీదేవి కవయిత్రి, కథకురాలు, పరిశోధకులు, బాల సాహితీవేత్త. వివిధ పత్రికల్లో వీరి రచనలతోపాటు నిజామాబాద్ రేడియో ద్వారా కవితలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి. కవయిత్రిగా ఆరుట్ల శ్రీదేవి ప్రచురించిన కవితా సంపుటి ‘రంగుల పూలు’. ‘అడవి మల్లెలు’ పేరుతో మరో కవితా సంపుటి సిద్ధంగా ఉన్నప్పటికి అచ్చులోకి రాలేదు. రాష్ట్ర స్థాయిలో వివిధ కవితల పోటీల్లో పాల్గొని అనేక బహుమతులను అందుకున్నారు శ్రీదేవి. వాటిలో వసుంధర విజ్ఞాన మండలివారి రాష్ట్రస్థాయి కవితల పోటీలో మొదటి బహుమతి, సయ్యద్ సైదా స్మారక మినీ కవితల పోటీ బహుమతి ఉన్నాయి. శ్రీకిరణ్ సాంస్కృతిక సంస్థ పురస్కారం, ధాత్రి మహిళా సేవా రత్న పురస్కారం, ఇందూరు యువత పురస్కారం, శాతవాహన విశ్వవిద్యాలయం ద్వారా ఎం.వి.నరసింహారెడ్డి తెలంగాణ పురస్కారం, చౌటపల్లి హనుమంతరెడ్డి స్మారక ఉపాధ్యాయ పురస్కారం మొదలనవి శ్రీదేవి అందుకున్నారు. భక్తి గీతాలు, నానీలు, సినిమా వ్యాసాలు, సినిమా స్క్రిప్టులు రాసిన శ్రీదేవి కొన్నింటిని మాత్రమే అచ్చులోకి తెచ్చారు.
బాలల కోసం గేయాలు, కథలు, నవల, గేయనాటికలు రాసిన శ్రీదేవి బాల సాహితీవేత్తగా కూడా పరిచితులు. తొలి బాల సాహిత్య రచన ‘బాలలు మెచ్చిన కథలు’ 2014లో అచ్చయ్యింది. ‘చిలుక కథలు’ కథా సంపుటి, ‘నాగజ్యోతి’ నవల, ‘చుక్క బిస్కట్లు’ గేయ సంపుటితో పాటు మరో గేయ నాటికల సంపుటి సిద్ధంగా ఉన్నాయి. బాలలు మెచ్చిన కథలు వివిధ వయస్సుల పిల్లల కోసం శ్రీదేవి ప్రేమగా చెప్పినవి. ఇందులోని కథలన్నీ పిల్లలు నచ్చేవి, మెచ్చేవి కూడా. ‘ముత్యపు చినుకు’ కథ రచయిత్రి ఊహతోపాటు చదివే పిల్లల ఊహలకు కూడా చక్కని పనికల్పించే కథ. యిందులోని పాత్రలు కూడా చంద్రిక, వెన్నెల కావడం విశేషం. ‘నల్లరంగు’ కథ రంగు ప్రధానం కాదని, మానవత్వం, మనసు ప్రధానమని చెబుతుంది. కొద్దిగా పెద్ద పిల్లల స్థాయిదైనా ‘కుల వీరుడు’ ఫాంటసీతో పాటు వివిధ విషయాలను ప్రతిబింబిస్తుంది. గాంధీతాత కథ మనకు తెలుసు, గురువు కాపీ కొట్టమంటే నేనే కొట్టనని సత్యవ్రతుడుగా నిలిచాడాయన. ఇందులో ‘చదువు దొంగ’ కథ కాపీ కొట్టి చదివిన విద్యార్థి భవిష్యత్తులో ఆ విద్య అవసరమైనప్పుడు అసలైన చదువులేక ఎలా బాధలకులోనయ్యాడో చక్కగా తెలుపుతుంది. ‘జీవహింస’ కథ తోటి ప్రాణుల పట్ల ప్రేమ, కరుణ, భూతదయ అన్ని ప్రాణుల ఎడల చూపాలని చెప్పే కథ. యిలా ‘పాపం పుణ్యం’, ‘తనకు మాలిన ధర్మం’, ‘తగిన వరుడు’, ‘నాకేం కావాలి’ వంటి అనేక మంచి కథల సంచి ఈ బాలలు మెచ్చిన కథల వయ్యి.
శ్రీదేవి కథలతో పాటు చక్కని గేయాలు కూడా రాశారు. ‘చెకుముకి పిట్ట/ చలాకి పిట్ట/ టకటక మంటూ/ చెట్టును పొడిచే/ జరజర మంటూ/ తొర్రను తొలిచే’ అంటూ లయాత్మకంగా రాస్తుంది. ‘అన్నమెపుడు కూడా/ విసిరి కొట్టవద్దు/ అమ్మ మీద అలగడం/ మానుకుంటె ముద్దు/ నాన్నగారి మాట జవదాటవద్దు/రోజువారి పనుల్లో/ సహకరిస్తే ముద్దు’ అంటూ ముద్దుగా చెబుతుంది. ఇంకా ‘అఆలు నేర్చేద్దాం/ అమ్మ పేరు రాసేద్దాం’ అనడంలో ఆమె గొప్పదనమే కాదు బాలల్లో బాల్యంలోనే తల్లి తండ్రుల పేరు నిలబెట్టాలన్న విషయాన్ని అందంగా చెప్పడం చూడవచ్చు. ఉపాధ్యాయిని కదా! బోధించడం బాల గేయాల్లో కూడా కనిపిస్తుంది, అటువంటిదే ‘తప్పు చేయవద్దు/ తల దించవద్దు’ అంటూ చెబుతూనే ‘మిత్రులతో ఎప్పుడూ/ తగువులాడ వద్దు/ అన్నదమ్ములై/ కలిసుంటే ముద్దు’ అంటారు. మరిన్ని చక్కని రచనలు చేయాలని కోరుకుంటూ…. జయహౌ! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్
9966229548
బాలలు మెచ్చే కథలు చెప్పిన ఆరుట్ల
10:32 pm