నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల సామగ్రి, ఈవీఎం,వీవీప్యాట్స్ భద్రపరచిన స్ట్రాంగ్ రూం హెచ్చరిక అలారం శనివారం ఉదయం ఆకస్మాత్తుగా మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్‌కు నియోజకవర్గం ఎన్నికల అధికారి, ఆర్డీఓ బి.చెన్నయ్య తెలియజేశారు. కలెక్టర్ కర్ణన్, జిల్లా పోలీస్ సూపరింటండెంట్ కే.అపూర్వరావు, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సమక్షంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు రాగా స్ట్రాంగ్‌రూం తాళాలు తీసి పరిశీలించారు.పొగ వస్తేనే అలారం మోగే సాంకేతిక విధానం ఉంది. రూంలో ఎలాంటి పొగ వచ్చిన ఆనవాలు లేకపోవడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.అలారం బిగించే సమయంలో సాంకేతకంగా పొరపాటు జరగడం వల్ల అలారం మోగిందని, సాంకేతిక లోపాన్ని సరిచేసి తిరిగి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూంకు సీల్ వేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరిబాబు, కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ అధ్యక్షుడు ఎంఎ.సలీం, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, బీఎస్పీనాయకులు పి.దినేష్, ఆప్ నాయకులు ఎండి కుతుబుద్దిన్, ఎఐఎంఐఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ ఫరూక్, టీడీపీ కాసుల సత్యం, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రేపాల్ పురుషోత్తమరెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు ఎం.రావినాయక్ లున్నారు.