– ఉత్పత్తి 3.7 శాతం తగ్గే అవకాశం
– 2023-24 ఏడాదికి ఉత్పత్తి అంచనా 1063.13 ఎల్‌ఎంటీ
– గతేడాది 1105.12 ఎల్‌ఎంటీ
– కేంద్రం గణాంకాలు
న్యూఢిల్లీ : భారత్‌లో రుతుపవనాల ప్రభావం వరి ఉత్పత్తిపై పడనున్నది. ఫలితంగా వరి దిగుబడి తగ్గే అవకాశం కనిపిస్తున్నది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023-24 కు సంబంధించి విడుదల చేసిన ప్రధాన ఖరీఫ్ పంటల మొదటి ముందస్తు అంచనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. దీని ప్రకారం భారత వరి ఉత్పత్తి 1,063.13 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) వద్ద ఉన్నది. గత సంవత్సరం ఇదే సీజన్‌లో 1,105.12 ఎల్‌ఎంటీలతో పోలిస్తే 3.7 శాతం తగ్గుదల కావటం గమనార్హం. 2023-24లో అంచనా వేయబడిన ఉత్పత్తి.. 2021-2022లో నమోదైన 1,110.01 ఎల్‌ఎంటీ కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 2023-24 వరి ఉత్పత్తిలో అంచనా తగ్గుదల రుతు పవన వర్షాల అసమానత ప్రభావాన్ని చూపు తుందని వ్యవ సాయ, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో వరి విస్తీర్ణం పెరిగినప్పటికీ దాని ఉత్పత్తి తగ్గుతుం డటం గమనార్హం. వ్యవసాయ మం త్రిత్వ శాఖ ప్రకారం.. 2023 ఖరీఫ్ సీజన్‌లో వరి ఉత్పత్తి విస్తీర్ణం 411 లక్షల హెక్టార్లు. ఇది 2022లో అదే సీజన్‌లో విస్తీర్ణం 404.27 లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ కావటం గమనించాల్సిన విషయం. ”పంటల ఉత్పత్తి అంచనా రాష్ట్రాలు అందించిన డేటాపై ఆధారపడి ఉంటుంది. తర్వాత వివిధ ప్రత్యామ్నాయ వనరుల నుంచి సమాచారాన్ని ఉపయోగించి ధృవీకరించ బడుతుంది. 2023-24 (ఖరీఫ్) కోసం ఈ మొదటి ఉత్పత్తి అంచనా ఎక్కువ గా గత 3 సంవత్సరాల సగటు దిగుబడిపై ఆధార పడి ఉంటుంది. వాస్తవ పంట కోత ఆధారంగా దిగుబడి అంచనాలను స్వీకరించిన తర్వాత అది మార్పుకు లోనవుతుందని గమనించడం ముఖ్యం” అని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ”ఖరీఫ్‌లో ప్రధా న పంట అయిన వరి సాగు విస్తీర్ణం గతేడాది చివరి అంచ నా కంటే సుమారు 2 లక్షల హెక్టార్లు, సగటు వరి విస్తీర్ణం కంటే 4.5 లక్షల హెక్టార్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. సగటు ఖరీఫ్ బియ్యం ఉత్పత్తితో పోలిస్తే దీని ఉత్పత్తి దాదా పు లక్ష టన్నులు ఎక్కువగా ఉంటుందని అంచనా. ”2023 -24కి ఖరీఫ్ ముతక తృణధాన్యాల ఉత్పత్తి 351.37 ఎల్‌ఎంటీగా అంచనా వేయబడింది, ఇది సగటు ముతక తణధాన్యాల ఉత్పత్తి 350.91 ఎల్‌ఎంటీ కంటే కొంచెం ఎక్కువ. పప్పు ఉత్పత్తి 34.21 ఎల్‌ఎంటీగా అంచనా వేయబడింది. ఇది గతేడాది ఉత్పత్తిని పోలి ఉంటుంది” అని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొనటం గమనార్హం. సెంట్రల్ పూల్‌లో ఆహారధాన్యాల నిల్వలు క్షీణించడం, పెరిగిన తృణధాన్యాల ధరలు, ఖరీఫ్ సీజన్‌లో వరి పంటలకు కొనసాగుతున్న రుతు పవనాల అసమాన ముప్పు వంటి కారణాలతో ఈ ఏడాది జులైలో బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగు మతిని భారత్ నిషేధించింది. భారత్ ఇంతకు ముందు 2022 మే 13 నుంచి గోధుమల ఎగుమతి ని నిషేధించింది. 2022 సెప్టెంబర్8న పారా బాయిల్డ్ రైస్ మినహా అన్ని బాస్మతీయేతర బియ్యం పై 20 శాతం ఎగుమతి సుంకం విధించబడింది. 2022, సెప్టెంబర్ 9న విరిగిన బియ్యం ఎగుమతిపై నిషేధం విధించబడిన విషయం విదితమే.