ముదిరాజుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట

నవతెలంగాణ- గజ్వేల్‌
ముదిరాజుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేసి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నట్లు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌ పేర్కొన్నారు. శనివారం ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్‌తో కలిసి గజ్వేల్‌ సమీపంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు ముదిరాజ్‌ సమాజాన్ని నిర్లక్ష్యం చేయగా, అందుకు భిన్నంగా అధికారం చేపట్టింది మొదులు ముదిరాజులను అన్ని రకాలుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని స్పష్టం చేశారు. కోకాపేటలో 5 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు ముదిరాజ్‌ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని తెలిపారు. గజ్వేల్‌, సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌, జహీరాబాద్‌, కామారెడ్డి, నారాయణఖేడ్‌ తదితర ప్రాంతాలలో ముదిరాజుల ఆత్మగౌరవ భవనాలకు స్థలం కేటాయించడంతో పాటు భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. నిజామాబాద్‌లో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి మూడు ఎకరాల స్థలం కేటాయించినట్లు గుర్తు చేశారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులపై ముది రాజులకు పూర్తి హక్కులు కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం 2400 మంది మత్స్యకార్మికులు ఉండగా ఆ సంఖ్యను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6 వేలకు పెంచిందన్నారు. మత్స్య కార్మికులకు సబ్సిడీపై డీసీఎంలు, మోపెడ్లు, టాటా ఏసీలు, మోటార్‌ సైకిళ్ల అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కషి ఫలితంగా రూ.వెయ్యి కోట్లకుపైగా ప్రయోజనం కలిగిందని తెలిపారు. మత్స్య కార్మికులకు చేపలు పట్టే హక్కు కల్పించడంతో రాష్త్ర వ్యాప్తంగా 4 లక్షల మంది ముదిరాజులకు ప్రయోజనం జరిగిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్‌ల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వాటిని ముదిరాజులు సంఘటితంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని వివరించారు.