ఓటే ప్రధాన ఆయుధం

– అడిషనల్‌ కలెక్టర్‌ రమేష్‌
నవతెలంగాణ- కౌడిపల్లి
ప్రజలకు ఓటే ప్రధాన ఆయుధమని మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రమేష్‌ కుమార్‌ తెలిపారు. కౌడిపల్లిలో అధికారులకు ఓటు హక్కుపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు అనేది ఒక వెపన్‌లాంటిదని, అలాంటి ఓటును అమ్ముకోవద్దని అడిషనల్‌ కలెక్టర్‌ రమేశ్‌ సూచించారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేస్తే రాష్ట్రానికి, దేశానికి మంచి చేసిన వారవుతారని తెలిపారు. ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లాలో 100శాతం పోలింగ్‌ జరిగేలా అధికారులు బాధ్యత వహించాలన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటారన్నారు. నిజాయితీగా ఓటేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే భవిష్యత్తు ప్రణాళిక ఉంటుందన్నారు. డబ్బు, మద్యం, బంగారు ఆభరణాలకు ప్రలోభాలకు గురికాకుండా సేవ చేసే అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్‌ అధికారి రాజారెడ్డి, జిల్లా శిశు సంక్షేమ అధికారిని బ్రహ్మాజీ, సిడిపిఓ హెమ భార్గవి, తహసీల్దార్‌ ఆంజనేయులు, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏపీవో సంగమేశ్వర్‌, విద్యా కమిటీ చైర్మన్‌ జగన్‌, బిఎల్‌ఓలు ఉన్నారు.
నవతెలంగాణ- కొల్చారం
వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రమేష్‌, అదనపు ఎస్పీ మహేందర్‌లు అన్నారు. శనివారం మండల కేంద్రమైన కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఓటరు నమోదు ప్రాముఖ్యతపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్‌ రమేశ్‌ మాట్లాడుతూ 100 శాతం ఓటింగ్‌ లక్ష్యంతో అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ఓటు బ్రహ్మాస్త్రం లాంటిదని దేశాన్ని ప్రభావితం చేసే శక్తి, దేశంలో ఉన్న ప్రజలందరికీ ఓటు విలువ సమానంగా ఉంటుందన్నారు. అందుకోసం ఓటు హక్కును దుర్వినియోగం చేయకూడదన్నారు. ఈ నెల 31 వరకు ఓటరుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. నవంబర్‌ 10 నుంచి 25 తేదీ వరకు ఓటరు గుర్తింపు స్లీప్‌లు అందజేస్తామన్నారు. అదనపు ఎస్పీ మహేందర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్‌ యాప్‌ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ పీడీ బ్రహ్మాజీ, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, మండల ప్రత్యేక అధికారి నాగరాజు, తహశీల్దార్‌ గఫ్ఫార్‌, ఎంపీడీవో గణేష్‌ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్‌ నాగవర్ధన్‌, ఆర్‌ఐ ప్రభాకర్‌, ఏపీవో మహిపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.