కాంగ్రెస్‌ విజయభేరీని విజయవంతం చేయాలి

– కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి మైనంపల్లి రోహిత్‌ రావు
నవతెలంగాణ-మెదక్‌
మెదక్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగే కాంగ్రెస్‌ విజయభేరీ యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి మైనంపల్లి రోహిత్‌ రావు కోరారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిత్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ విజయభేరీ యాత్రకు అల్‌ ఇండియా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క, రాష్ట్ర అగ్ర నేతలు హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు. మెదక్‌ బోధన్‌ చౌరస్తా నుంచి యాత్ర మొదలై బస్‌ డిపో మీదుగా రాందాస్‌ చౌరస్తా వరకు కొనసాగుతుందన్నారు. అక్కడ సభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తారన్నారు. ఈ యాత్రకు కాంగ్రెస్‌ నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నేతకు డిపాజిట్‌ గల్లంతవడం ఖాయమన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌ నాయకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు జీవన్‌ రావు, గంగ నరేందర్‌, రాజిరెడ్డి, ఆవుల గోపాల్‌ రెడ్డి, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌ తో పాటు తదితరులు ఉన్నారు.