– ఇంటి స్థలాల అంశం చేరుస్తాం
– డీజేహెచ్‌ఎస్ ప్రతినిధులకు జి.కిషన్ రెడ్డి హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల అంశాన్ని పొందుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) అధ్యక్షులు బొల్లోజు రవి, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్ దండ రామకృష్ణ, సలహాదారు కె.విక్రమ్ రెడ్డి తదితరులు హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇది న్యాయబద్ధమైన విన్నపమేనని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు డీజేహెచ్‌ఎస్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.