– సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లి మహిళపై లైంగికదాడి
– కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
లక్నో : బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. నిత్యావసరాలు డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా.. దొరికినట్టే దొరికి వాళ్ల నుంచి తుపాకీ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. చివరికి అతడిపై కాల్పులు జరిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గ్రేటర్ నోయిడాలోని హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఓ మహిళ ఇంటికి అవసరమైన సరకులను యాప్‌లో ఆర్డర్ చేశారు. వాటిని తీసుకొని సుమిత్ సింగ్ (23) అనే డెలివరీ బారు ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారని నిర్ధరించుకొని, బలవంతంగా ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత ఫిర్యాదు మేరకు పోలీసులు బందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.మొబైల్ సిగల్స్ ఆధారంగా అతడు ఉన్న చోటును గుర్తించి, అక్కడికి వెళ్లే సరికి, వాళ్లకు లొంగిపోయినట్లు నటించాడు. అంతలోనే ఓ పోలీస్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరారయ్యాడు. పోలీసులు అతడివెంట పరుగెడుతుంటే కాల్పులు జరిపాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అతడి కాళ్లపై ఎదురుకాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు నోయిడా పోలీసులు వెల్లడించారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కోర్టు ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నాడన్న కారణంతో గతంలోనూ సుమిత్‌పై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.