– ‘ఇండియా’ కూటమి పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజకీయ పార్టీల పొత్తులను నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి చట్టపరమైన అధికారం లేదని సీఈసీ వెల్లడించింది. ప్రతిపక్ష పార్టీల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈసీ తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే, ‘ఇండియా’ పేరు చట్టబద్ధతపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని స్పష్టం చేసింది.వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనే వ్యూహంతో 28 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ పేరును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు దేశం పేరును ఉపయోగించుకుంటున్నాయని పిటిషనర్ గిరిష్ భరద్వాజ్ ఆరోపించారు. ఆ కూటమి ‘ఇండియా’ పేరును వినియోగించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. ఈ పిటిషన్ పై తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈసీ సోమవారం కోర్టుకు తమ స్పందన తెలియజేసింది. ”ఎన్నికలను నిర్వహించడం, రాజకీయ పార్టీలను రిజిస్టర్ చేసుకునే అధికారం ఈసీకి ఉంది. కానీ, రాజకీయ పొత్తులను ప్రజాప్రాతినిధ్య చట్టం, భారత రాజ్యాంగం కింద ‘నియంత్రిత సంస్థలు’గా గుర్తించలేం. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద రాజకీయ కూటములను చట్టపరమైన సంస్థలుగా పరిగణించలేం. అందువల్ల వాటి పనితీరును నియంత్రించేందుకు చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేదు” అని ఈసీ తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే, తమ విధివిధానాలకు అనుగుణంగా ఈ స్పందన తెలియజేశామని ఈసీ ఈ సందర్భంగా తెలిపింది. అంతేగానీ, ‘ఇండియా’ పేరు చట్టబద్ధత అంశంపై దీన్ని తమ స్పందనగా భావించరాదని స్పష్టం చేసింది.