బంగ్లాపై పాక్‌ గెలుపు

Pakistan win over Bangladesh– ఛేదనలో మెరిసిన జమాన్‌, అబ్దుల్లా
– రాణించిన షహీన్‌ అఫ్రిది, వసీం
కోల్‌కత : ఎట్టకేలకు పాకిస్థాన్‌ ఓ విజయం సాధించింది. వరుసగా నాలుగు ఓటములు చవిచూసిన బాబర్‌ సేన కోల్‌కతలో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 205 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్‌ మరో 105 బంతులు ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ఫకర్‌ జమాన్‌ (81, 74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్‌ (68, 69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనర్లు పాకిస్థాన్‌ విజయానికి మార్గం సుగమం చేశారు. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (9) మరోసారి విఫలమైనా.. మహ్మద్‌ రిజ్వాన్‌ (26 నాటౌట్‌, 21 బంతుల్లో 4 ఫోర్లు), ఇఫ్తీకార్‌ అహ్మద్‌ (17 నాటౌట్‌, 15 బంతుల్లో 2 ఫోర్లు) లాంఛనం ముగించారు. బంగ్లా స్పిన్నర్‌ మెహిది హసన్‌ మిరాజ్‌ (3/60) మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది. పాక్‌ బౌలర్లు షహీన్‌ షా అఫ్రిది (3/23), మహ్మద్‌ వసీం (3/31) మూడు వికెట్లతో విజృంభించారు. బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో మహ్మదుల్లా (56, 70 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీ సాధించగా.. కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ (43, 64 బంతుల్లో 4 ఫోర్లు), లిటన్‌ దాస్‌ (45, 64 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. హసన్‌ (0), నజ్ముల్‌ (4), ముష్ఫీకర్‌ (5), హృదరు (7) విఫలమయ్యారు. ఛేదనలో చెలరేగిన ఫకర్‌ జమాన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. పాకిస్థాన్‌కు ఏడు మ్యాచుల్లో ఇది మూడో విజయం కాగా..బంగ్లాదేశ్‌కు ఏడు మ్యాచుల్లో ఇది ఆరో పరాజయం.