– కాంగ్రెస్ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి
– కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించాలి
– ప్రజల్లో లేని వారికి టికెట్లు సరికాదు
– కరోనా కష్టకాలంలో కనిపించని వారికి టికెట్లా..?
– ఇబ్రహీంపట్నంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ టికెట్ విషయంలో పునరాలోచించాలని ఆ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి అధిష్టానాన్ని కోరారు. పార్టీ టికెట్ తనకే ఇవ్వాలని కోరారు. ఇబ్రహీంపట్నంలోని సాయి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భవిష్యత్ కార్యాచరణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజా సేవలో వారికి చేదోడు వాదోడుగా మెలుగుతున్న నాయకులకు ఆదరణ కరువైందన్నారు. కుళ్ళు, కుతంత్ర రాజకీయాలకు ఇంకా అలవాటు పడలేదని చెప్పుకొచ్చారు. ఎంత ప్రజాసేవ చేసినా ఏదో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ విషయంలోనూ గెలిచిన ఎమ్మెల్యే, ఓడిన అభ్యర్థి కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేశారని చెప్పారు. ఇప్పటికీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం దీపం కింద చీకటి అన్న విధంగా మారిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకునేవారు కరువయ్యారన్నారు. పదవ తరగతి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేస్తుంటే హేళన చేస్తున్నారని మండిపడ్డారు. వారి అవివేకానికి నిదర్శనన్నారు. కరోనా కష్టకాలంలో పంచాయతీ కార్మికులను మొదలుకొని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులను హక్కున చేర్చుకొని ఆదుకున్నామని చెప్పారు. గ్రామ గ్రామాన అభాగ్యులకు ఆసరాగా నిలిచామన్నారు. సర్పంచిగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉంటున్నామన్నారు. తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు చెదిరిపోకుండా అనునిత్యం వారికి వెన్నంటే ఉన్నానని చెప్పారు. కానీ గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు ప్రజల్లో లేని వ్యక్తులకు ఏ విధంగా టికెట్లు ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం అభ్యర్థి విషయంలో పునపరిశీలన చేయాలని కోరారు. తనకే బీఫామ్ అందజేయాలన్నారు. యువతకు అవకాశం ఇవ్వాలన్నారు. సీనియర్ నాయకత్వం యువతను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాలన్నారు. కానీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇది జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక కూర్పు కూడా కొరవడుతోందని ఆందోళన వెలిబుచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మిడి శ్రీనివాసరెడ్డి, దిండి రామిరెడ్డి, లక్ష్మయ్య, వెంకటరెడ్డి, కష్ణయ్య, రామకష్ణ, మోతీరాం నాయక్, వాజిద్, కమలాకర్ రెడ్డి, భారీ స్థాయిలో పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.