ఎంపీ ఎన్నికల్లో హిందూత్వ అంశం

ఎంపీ ఎన్నికల్లో హిందూత్వ అంశం– రామ మందిర నిర్మాణం పేరుతో ప్రచారం
– కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పిస్తూ లబ్ది పొందే యత్నం
– బీజేపీ తీరుపై ప్రజలు, విశ్లేషకుల ఆగ్రహం
భోపాల్‌ : ఎన్నికలు ఎప్పుడొచ్చినా అభివృద్ధికి బదులు మతం పేరు చెప్పుకొని ఓట్లు అడగటం బీజేపీకి అలవాటు. పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోతే.. మతాల మధ్య గొడవలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ది పొందటం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ దేశంలో అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ హిందూత్వ రాజకీయాలకు తెరలేపింది. రామ మందిర అంశంతోనే 90వ దశకం నుంచి ఆ పార్టీ రాజకీయంగా ఎదిగింది. ఇప్పుడు కూడా మధ్యప్రదేశ్‌లో అదే చేస్తోంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి సంబంధించిన బిల్‌బోర్డ్‌లు, పోస్టర్‌లను బీజేపీ మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసింది. ”భవ్య రామ మందిర్‌ బంకర్‌ హౌ రహా హై తైయార్‌, ఫిర్‌ ఇస్‌ బార్‌ బీజేపీ సర్కార్‌ (భవ్యమైన రామ మందిరం సిద్ధం అవుతున్నది. ఈసారి మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది)” అని ఆ పోస్టర్లు ప్రకటిస్తున్నాయి.
కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌ షా.. గతనెల 28 నుంచి మూడు రోజుల పాటు మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హిందూత్వ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. గతంలో అయోధ్యలో ఆలయాన్ని నిర్మించాలనే బీజేపీ ఉద్దేశ్యాన్ని అనుమానించినందుకు కాంగ్రెస్‌ను ఆయన తప్పుబడుతూ ఆరోపణలు చేశారు. చింద్వారాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా మాట్లాడుతూ.. ”రామమందిర శంకుస్థాపన తేదీ ఖరారైంది.” అని ప్రకటించారు. అయితే, కేంద్ర హౌంమంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందించలేదు. అయితే బీజేపీ తన పోస్టర్లలో అయోధ్య రామమందిరానికి సంబంధించిన ఫోటోలను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రామ మందిరం చుట్టూ ప్రచారం జరుపుతూ మధ్యప్రదేశ్‌లోని ఓటర్లలో మతపరమైన ఉద్వేగాన్ని రెచ్చగొట్టడానికి బీజేపీ యత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. అయితే, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి అంతగా స్పందన లేదనీ, ఆ పార్టీ తీరు ఓటర్లకు పూర్తిగా అర్థమైందని అంటున్నారు. యూపీలోని రామజన్మ భూమి అంశాన్ని ఇక్కడకు తీసుకురావటం ఏమిటనీ ఓటర్లు మాత్రమే కాదు.. బీజేపీలోని నాయకులే పార్టీ అధిష్టానం తీరును ప్రశ్నిస్తున్నారు. నియోజక వర్గాలకు టిక్కెట్ల విషయంలో జరిగిన అంతర్గత పోరుతో చాలా మంది నేతలు అయోమయంలో ఉన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి వంటి అంశాలు యువత, సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు కావాల్సింది ఉద్యోగ, ఉపాధి కల్పన వంటివనీ, ఇలాంటి మతపరమైన భావోద్వేగ అంశాలు కాదని చెపుతున్నారు. ఎన్నికల కోసమే అయినా బీజేపీకి భిన్నంగా కాంగ్రెస్‌ ఇలాంటి అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించిందనీ, ఆ పార్టీకి ప్రజల మద్దతు ఉండే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కుల గణన కోసం కాంగ్రెస్‌ మండల్‌ వర్సెస్‌ కమండల్‌ను తెరపైకి తెచ్చిందన్నారు. రాష్ట్రంలో బీజేపీపై కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని సర్వేలు సైతం అంచనా వేసాయి. జీ-సీ4 నిర్వహించిన తాజా సర్వేలో కాంగ్రెస్‌కు 132-146 సీట్లు, బీజేపీకి 84-98 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఒపీనియన్‌ పోల్‌ కాంగ్రెస్‌కు 46 శాతం ఓట్లు, బీజేపీకి 43 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి నవంబర్‌ 17న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.