ప్రజాప్రభుత్వాన్ని నిర్మిద్దాం

Let's build a people's government– బీఆర్‌ఎస్‌, బీజేపీని బొందపెట్టాలి
– చివరి నిముషంలో ప్రియాంక పర్యటన రద్దు
– మేం కట్టిన ప్రాజెక్టులు చూడండి..కాళేశ్వరాన్ని చూడండి
– ఆరు గ్యారంటీల అమలుకు ఇందిరమ్మ రాజ్యం రావాలి
– కౌలు రైతులకూ రైతుబంధు ఇస్తాొం ప్రజాబలం కలిగిన ఓటర్లంతా గబ్బర్‌సింగ్‌లే..
–  మనది రాజకీయబంధం కాదు..కుటుంబ బంధం : కొల్లాపూర్‌ సభలో రాహుల్‌ గాంధీ
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
”తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మించాలి. కేంద్రంలో బీజేపీకీ బీఆర్‌ఎస్‌, ఎంఐఎం జతకట్టి మతతత్వ విధానాలకు ఆజ్యం పోస్తున్నాయి.. పాలకుల తప్పిదాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది.. బీఆర్‌ఎస్‌, బీజేపీలు తెలంగాణ ప్రజలను దోపిడీ చేశాయి. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను పాతరపెట్టాలి. సీఎం కేసీఆర్‌ కుటుంబం ఒకవైపు.. ప్రజలు ఒకవైపు ఉన్నారు.. దోచుకున్నదాన్నంతా కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చాక కక్కిస్తాం..” అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలో మంగళవారం పాలమూరు ప్రజాపోరు సభ డీసీసీ అధ్యక్షులు డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అధ్యక్షతన జరిగింది. సభలో రాహుల్‌ ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్‌ పార్టీకి, అమ్మ సోనియమ్మకు రాష్ట్ర ప్రజలు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని అన్నారు. నాకు మరో మీటింగ్‌ ఉన్నా.. సోదరి ప్రియాంకగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం తాను కొల్లాపూర్‌ సభకు హాజరైనట్టు తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల చివరి నిముషంలో ప్రియాంకగాంధీ హాజరు కాలేకపోయారని, అందుకే తాను వచ్చినట్టు వివరించారు. ‘మనది రాజకీయబంధం కాదు, కుటుంబబంధం’ అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో ప్రజాస్వామిక వాదులు గెలుపొందుతారని రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం పేరుతో ధరణి తెచ్చి ప్రభుత్వ భూములన్నింటినీ కొల్లగొడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టడం ఖాయమన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి రాష్ట్రంలో లక్ష కోట్లు మెక్కాయని ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చి అప్పుల తెలంగాణగా మార్చారని, ఇప్పుడు ప్రతి వ్యక్తి ఏడాదికి 31 వేలు చెల్లించినా అప్పు తీరదన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే జూరాల, సింగూర్‌, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వంటి భారీ ప్రాజెక్టులు నిర్మించామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ కట్టిన బ్యారేజ్‌ కుంగిపోయింది.. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ప్రాజెక్టులను చూడండి.. కాళేశ్వరం ప్రాజెక్టును చూడండి.. ఇదే కాంగ్రెస్‌ పనితీరుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు భూములను పంచితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని గుంజుకుంటోందన్నారు. రెవెన్యూ, ఇసుక, మందు శాఖల ద్వారా వచ్చే కోట్ల రూపాయలు కేటీఆర్‌ కుటుంబానికి పోతున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుబంధు రద్దు చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రైతు భరోసా పేరుతో రైతులందరికీ ఎకరాకు ఏడాదికి రూ.15000, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ.12000 చెల్లిస్తామన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మహిళలను గౌరవిస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఒకో ఇంటికి ఐదు లక్షలు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు.
కేంద్రంలో జీఎస్టీ, రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక చట్టాల వంటి ప్రమాదకరమైన విధానాలను తీసుకొస్తే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. ప్రజాబలం గలిగిన మీరంతా గబ్బర్‌ సింగ్‌లే.. అని పిలుపునిచ్చారు. 2024లో కేంద్రంలో బీజేపీ ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, రాజేష్‌ రెడ్డి, జగదీశ్వర్‌ రావు, కూచుకుల్ల దామోదర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.